ఘనంగా కందాల రంగారెడ్డి 41వ వర్ధంతి వేడుకలు..

ఘనంగా కందాల రంగారెడ్డి 41వ వర్ధంతి వేడుకలు..
చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో సిపిఐఎం పార్టీని బలోపేతం చేస్తూ ప్రాణ త్యాగం చేసిన కందాల రంగారెడ్డి 41 వ వర్ధంతి వేడుకలను ఆదివారం చౌటుప్పల్, తూర్పుగూడెం, పంతంగి, రెడ్డిబావి గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన స్మారక స్తూపాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
గత 41 సంవత్సరాల క్రితం ఎర్రజెండా ముద్దుబిడ్డ కందాల రంగారెడ్డి ని కాంగ్రెస్ గుండాలు హతమార్చారని, ఎక్కడ కూడా పార్టీ శ్రేణులు బెదరకుండా రంగారెడ్డి వారసత్వంతో నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల నిక్కచ్చిగా పోరాడారన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ తెలిపారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా పార్టీ అభివృద్ధి కోసం మొక్కవని దీక్షతో ఈ మండలంలో సిపిఎం పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు.
నేటి కార్పొరేట్ రాజకీయాలలో పుట్టకో పార్టీ మారే కాలంలో ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా నిలబడేది కమ్యూనిస్టులే అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు లేకుండా 6 గారంటీలను అమలు చేయాలన్నారు. వచ్చే వేసవి కాలంలో ప్రజలకు నీటి ఎద్దడి సమస్య రాకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి, జిల్లా కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, ఎండి పాషా, రాగిరు కిష్టయ్య, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, నాయకులు చీరిక సంజీవరెడ్డి, చింతల సుదర్శన్, తడక మోహన్, బోయ యాదయ్య, అంతటి అశోక్, కొండే శ్రీశైలం, మున్సిపల్ కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మున్సిపల్ ఫోర్ లీడర్ గోపనబోని లక్ష్మణ్, మాజీ సర్పంచ్ భీమిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కందాల రవీందర్ రెడ్డి, ఆకుల ధర్మయ్య, చీరిక అలివేలు తదితరులు పాల్గొన్నారు.
