Kanchi Pitam | కంచి కామకోటి పీఠాధిపతిగా ఎపికి చెందిన‌ గణేశశర్మ..

హైదరాబాద్‌: తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా రుగ్వేద పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఎంపిక చేశారు. ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా ఆయనకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. ఈమేరకు కంచి కామకోటి పీఠం వర్గాలు వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన గణేశశర్మ.. 1998లో దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తిపేరు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రావిడ్‌. ఆయన తండ్రి అన్నవరం ఆలయంలో మూడు దశాబ్దాలుగా వ్రత పురోహితుడిగా ఉన్నారు. గణేశశర్మ తన ఆరో ఏటనే రత్నాకర భట్టు వద్ద రుగ్వేదం అభ్యసించి నిష్ణాతులయ్యారు. 2006లో వేద్య అధ్యయన దీక్ష తీసుకున్నారు. ద్వారకా తిరుమల ఆలయంలో వేదవిద్యను అభ్యసించారు. అనంతరం తెలంగాణలోని బాసర జ్ఞానసరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేదపాఠశాలలో సేవలందించారు. ఆ సమయంలో బాసర పర్యటనకు వచ్చిన విజయేంద్ర సరస్వతి ఆయనను శంకర మఠానికి తీసుకెళ్లారు.

అక్కడ తర్కం, మీమాంసతో పాటు సామవేదం, యజుర్వేదంలో స్వామీజీ స్వయంగా శిక్షణ ఇచ్చారు. 2018 జనవరి 28న జయేంద్ర సరస్వతి మహాసమాధి చెందడంతో అప్పట్లో ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. గత ఆరేండ్లుగా ఉత్తరాధికారి ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది.

Leave a Reply