Kalvakuntla Kavitha | తెలంగాణ ప్రజల బాణాన్ని

Kalvakuntla Kavitha | తెలంగాణ ప్రజల బాణాన్ని
ట్రిపుల్ ఆర్, రైతులు, ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
2029 ఎన్నకల్లో పోటీకి సిద్ధం
జాగృతి జనం బాటలో కవిత
Kalvakuntla Kavitha | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : తాను తెలంగాణ ప్రజల బాణాన్ని, తనను ఎవరూ ఆపరేట్ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. ఇవాళ భువనగిరి వివేరా హోటల్ లో మీడియాతో మాట్లాడారు. 2029 ఎన్నికల్లో తప్పకుండా బరిలో ఉంటామని ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణం చెప్పలేదని తెలిపారు. బీఆర్ఎస్‌లో జరిగిన తప్పులకు పార్టీలో ఉన్న సమయంలో తాను కూడా భాగస్వామినేనని అంగీకరిస్తూ, అప్పట్లో జరిగిన ప్రజా అన్యాయాలకు క్షమాపణలు చెప్పారు.

ట్రిపుల్ ఆర్‌పై తీవ్ర విమర్శలు:
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ (Triple R Project) లో పెద్దల భూములను కాపాడేందుకు పేదల భూములను బలిచేస్తున్నారని ఆరోపించారు. నాయకుల అవినీతి కారణంగానే ఇష్టానుసారంగా రింగ్ రోడ్ ఆలైన్‌మెంట్లు మారుస్తున్నారని మండిపడ్డారు. దీనిపై జాగృతి తరఫున ఆన్‌లైన్ ఉద్యమం చేపడతామని, జనవరి 5న హైదరాబాద్‌లో బాధిత రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.

బస్వాపూర్, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులపై ప్రశ్నలు..
బస్వాపూర్ రిజర్వాయర్ (Baswapur Reservoir) ద్వారా ఇప్పటివరకు చుక్కనీరు కూడా రాలేదని, కెనాల్స్ పూర్తి కాలేదని విమర్శించారు. 96వేల ఎకరాల భూములు పరిహారం లేకుండా తీసుకున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఎయిమ్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన..
భువనగిరిలోని ఎయిమ్స్ (Bhuvanagiri AIIMS) లో భవన నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని, స్థానికులకు 80శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు.

ప్రాంతీయ సమస్యలపై పోరాటం..
ఆలేరు హాస్పిటల్ (Alleru Hospital) ను 100 పడకలుగా మార్చాలని, ఆలేరు–జనగాం మధ్య కొత్త బ్రిడ్జి నిర్మించాలని, మోటకొండూరు, రాయగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, భూదాన్ ప్రాంతాల్లో భూ నిర్వాసితులు, చేనేతలు, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాగృతి తరఫున నిరంతర పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జాగృతి ముందుకు సాగుతుందని తెలిపారు.

