వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి..

వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి..

సత్వరమే నూతన వె్జ్ బోర్డు ఏర్పాటు చేయాలి
ఐజేయూ ప్లీనరిలో శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

విజయవాడ, ఆంధ్రప్రభ : వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించాలని, సత్వరమే కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు తో పాటు , మీడియా స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐ జేయూ) అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిస్టులకు వేతన సవరణలు జరగలేదని, దీంతో వారి పరిస్థితి అసంఘటిత రంగం కార్మికుల కంటే దారుణంగా మారిందని తెలిపారు.

రాజ్యాంగంలో 4 వ స్థంభంగా పిలిచే మీడియా నేడు ముక్కలు అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని కేంద్ర రద్దుచేసిందన్నారు. జర్నలిస్టులను దిగజార్చడానికే నేషనల్ మీడియా కౌన్సిల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో వర్కింగ్ జర్నలిస్టులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. ఆర్ ఎన్ ఐ ను మార్చివేసి పి ఆర్ జి ఐ ను ఏర్పాటు చేసిందని అన్నారు. “బలమైన, స్వతంత్ర విధానం లేకుండా ప్రజాస్వామ్యం సజావుగా నడవదు.

దురదృష్టవశాత్తు, మీడియాను కేవలం నిర్లక్ష్యం చేయడమే కాకుండా, వ్యవస్థపూర్వకంగా నియంత్రిస్తున్నారు,” అని ఆయన వ్యాఖ్యానించారు. పని గంటలు, నైట్ డ్యూటీ నియమాలు వంటి ప్రాథమిక అంశాలను యాజమాన్యాలు తరచుగా పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డిజిటల్ (సోషల్) మీడియా ఒత్తిడితో సాంప్రదాయ మీడియా క్షీణిస్తోందని, పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రేక్షకాదరణ కోసం తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

న్యూఢిల్లీలోని యూఎన్ఐ కార్యాలయాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటనను ఆయన పెరుగుతున్న అసహనానికి ఉదాహరణగా పేర్కొన్నారు. “ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మరింత అధికారాలతో మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా పునర్వ్యవస్థీకరించాలనే తీర్మానాన్ని ప్లీనరీ ఆమోదించింది,” అని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల పరిస్థితి దిగజారుతోందని, దాడులు, హత్యల వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.

“దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విధులు నిర్వహించే సమయంలో జర్నలిస్టులు తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. స్వేచ్ఛా భావ వ్యక్తీకరణపై అధికారుల అసహనం పెరుగుతోంది,” అని అన్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వై. సత్యనారాయణ (సుజనా చౌదరి) సోషల్ మీడియా నియంత్రణలేమిపై ఆందోళన వ్యక్తం చేశారు. “సోషల్ మీడియా సరైన నియంత్రణలు లేకుండా యాంటీ-సోషల్ మీడియాగా మారుతోంది.

జర్నలిజం విలువల ఆధారంగా ఉండాలి. వార్తల నిజానిజాలను నిర్ధారించే విధానాలు అవసరం. నేను నియంత్రణకు మద్దతు ఇవ్వడం లేదు, కానీ సరైన మార్గదర్శకాలు అవసరం,” అని తెలిపారు. విశాలాంధ్ర ఎడిటర్ ఆర్.వి. రామారావు మాట్లాడుతూ, మీడియా యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్తోందని, స్వతంత్ర జర్నలిజాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. “భయపడి కాకుండా స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వతంత్ర మీడియాను బలపరచడానికి ఐజేయూ చర్యలు తీసుకోవాలి,” అని సూచించారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎల్.

కృష్ణ దేవరాయలు కూడా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా అంబటి అంజనేయులు, కె. అమర్‌నాథ్, ప్రేమనాథ్ భార్గవ్, మాణికొండ చలపతి రావు వంటి మరణించిన సీనియర్ జర్నలిస్టులకు ఐజేయూ నాయకులు పుష్పాంజలి ఘటించారు. సమావేశం ప్రారంభానికి ముందు కె. శ్రీనివాస్ రెడ్డి ఐజేయూ జెండాను ఆవిష్కరించారు.

ఐజేయూ సీనియర్ నాయకులు ఎస్.ఎన్. సిన్హా, డి. అమర్, ఎం.ఎ. మజీద్, కొత్తగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి డి. సోమ సుందర్, అమర్ మోహన్ ప్రసాద్, వై. నరేందర్ రెడ్డి, డీఎస్‌ఆర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో వచ్చిన ప్రతినిధులను ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు స్వాగతించారు.

ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ కళాకారులు పల్లె నర్సింహా. పి చంద్రనాయక్, ఆర్ పిచ్చయ్య దేశభక్తి, చైతన్యపూరిత గీతాలను ఆలపించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సిల్వెస్టర్ తన ప్రదర్శనతో అలరించగా, నగరానికి చెందిన యువ నర్తకులు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు.

Leave a Reply