తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “తెలంగాణ రైజింగ్” బృందం జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌ను సందర్శించింది. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శనకు వెళ్లిన బృందానికి అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటో, వారి శాసనసభ్యుల బృందం ఘనంగా స్వాగతించింది.
ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, అధికారులు జయేష్ రంజన్, వి. శేషాద్రి, అజిత్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి అసెంబ్లీని సందర్శించారు.
శాసనసభ్యుల సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘హిరోషిమాకు రావటం గౌరవంగా ఉంది. హిరోషిమా అంటే ఆశ. ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమని ప్రపంచానికి నిరూపించిన నగరం. హిరోషిమా మాదిరిగానే ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ. దూరదృష్టితో విజయం సాధించిన రాష్ట్రం’ అని అన్నారు.
‘శాంతి, స్థిరత్వం, సమృద్ధి వంటి విలువలను పంచుకుందామని మంత్రి శ్రీధర్బాబు హిరోషిమా ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. పెట్టుబడులకు కాకుండా పరస్సర సహకారం, భాగస్వామ్యం గురించి మాట్లాడటానికి వచ్చామని, కలిసికట్టుగా మెరుగైన, పచ్చని, సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దామని అన్నారు.
ఇప్పటికే యాభైకి పైగా జపాన్ కంపెనీలు తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తున్నాయని, మరిన్ని కంపెనీలను మంత్రి స్వాగతించారు. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ప్రిసిసన్ మ్యానుఫాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో గొప్ప అవకాశాలున్నాయని అన్నారు.
తెలంగాణను సందర్శించి, రాష్ట్ర ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణ దేశానికి గేట్ వేగా.. ప్రపంచానికి విస్తరించే వేదికగా ఉంటుందని అన్నారు. హిరోషిమా-హైదరాబాద్, జపాన్-తెలంగాణ మధ్య బలమైన సంబంధాల వారధిని నిర్మిద్దామన్నారు.
అసెంబ్లీ సందర్శన తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం హిరోషిమా చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం, శాసనసభ్యుల బృందం రేవంత్ రెడ్డి బృందాన్ని గాంధీ మెమోరియల్, హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అణుబాంబు డోమ్‌ల వద్దకు తీసుకెళ్లింది.