AP | రాజకీయ ముసుగు ధరించిన నేరస్థుడు జగన్ : హోంమంత్రి అనిత

శ్రీ సత్యసాయి బ్యూరో, జులై 21 (ఆంధ్రప్రభ): వైకాపా అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) రాజకీయ ముసుగు ధరించిన పెద్ద నేరస్థుడని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) విమర్శించారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం చేపట్టి ఐదేళ్ల కాలంలో పలు వ్యవస్థలను నిర్వీర్యం చేసి, తన అసమర్థత పాలన తో రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో 20ఏళ్ల వెనక్కి నెట్టిన ఘనతను సాధించిన వ్యక్తిగా వైస్ జగన్ ను హోంమంత్రి అనిత అభివర్ణించారు.

సోమవారం ఆమె శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర (Madakasira)లోని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు (MLA M.S. Raju) క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి రాష్ట్ర ప్రజలు ఏమి అనుకుంటున్నారు. తమ ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి గురించి ఏ మేరకు ప్రజలకు తెలుసనే విషయాలను అధ్యయనం చేయడం కోసం తాము ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో నియోజకవర్గాల వారీగా పర్యటించడం జరుగుతోందన్నారు. గడచిన ఐదేళ్ల‌లో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయి వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమన్యాయం అనే నినాదంతో అమరావతి (Amaravati), వైజాగ్ (Vizag) లనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు విశేషంగా కృషి చేయడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా అనేక పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇక సంక్షేమం కు సంబంధించి హోమ్ మంత్రి అనిత మాట్లాడుతూ… సంక్షేమ విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ వెనకడుగు వేయడం జరగదన్నారు. తాము రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు కనీసం రెండు పూటలా తక్కువ ధరతో భోజనం పెడుతుంటే గత ప్రభుత్వం వాటిని రద్దుచేసి, పేదల కడుపు కొట్టిందన్నారు. ఇలాంటి పథకాన్ని గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పేరును తొలగించి రాజన్న క్యాంటీన్లు అని పెట్టి కొనసాగించినా బాగుండేదని, కానీ పేదల కడుపు కొట్టడం కోసమే వైస్ జగన్ అధికారంలోకి వచ్చారని ఆమె దుయ్యబట్టారు.

కాగా తాజాగా మద్యం కుంభకోణంలో అరెస్టు కాబడిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో హోంమంత్రి స్పందిస్తూ.. పూర్తి ఆధారాలతో అరెస్టు చేయడం జరిగిందే తప్ప ఎలాంటి కక్షపూరితంగా అరెస్ట్ అనేది జరగలేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు.

ఆధారాలతోనే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్.. హోంమంత్రి అనిత
శ్రీ సత్యసాయి బ్యూరో, జులై 21 (ఆంధ్రప్రభ) : రాజంపేట ఎంపీ (Rajampet MP) మిథున్ రెడ్డి (Mithun Reddy) ని పక్కా ఆధారాలతోనే అరెస్టు చేయడం జరిగిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ((Vangalapudi Anita) పేర్కొన్నారు. సాధారణంగా ఎంపీని అరెస్టు చేయడం అంటే ఆశామాసి అంశం కాదని, పూర్తి ఆధారాలున్న‌ కారణంగానే ఎంపీ అరెస్టు జరిగిందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. సోమవారం ఆమె శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వం మద్యం కుంభకోణంలో వేలకోట్లు తారుమారు జరిగిందని, ఈ విషయంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి పలువురిని అరెస్టు చేయడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్న కోర్టుకు వెళ్లి నిరూపించుకోవచ్చన్నారు. వాస్తవానికి కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి 14రోజులు రిమాండ్ విధించడం అంటే కోర్టు అంత సులభంగా ఎలా విధిస్తుందని ప్రశ్నించారు. తగిన ఆధారాలున్న కారణంగానే కోర్టు సైతం రిమాండ్ విధించిందనే విషయం అందరూ గుర్తించాలని హోంమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

హోంశాఖ మంత్రికి ఘన స్వాగతం…
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు సోమవారం ఘన స్వాగతం లభించింది. ఈసందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రిని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్నమర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కాగా గత రాత్రి హోంమంత్రి వంగలపూడి అనిత మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు క్యాంపు కార్యాలయానికి చేరుకొని, అక్కడే బస చేయడం జరిగింది. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడిన అనంతరం హోంమంత్రి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

Leave a Reply