వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మౌళిక వసతుల పనులకు శ్రీకారం

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మౌళిక వసతుల పనులకు శ్రీకారం

భూదాన్ ప్లాట్లలో విద్యుత్, త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు
లబ్ధిదారులకు సౌకర్యవంతమైన నివాస వాతావరణం లక్ష్యం
మోడల్ కాలనీగా తీర్చిదిద్దే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు

ఖమ్మం బ్యూరో, ఆంధ్ర ప్రభ: ఖమ్మం నగరం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో మౌళిక వసతుల అభివృద్ధి పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం గృహ స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించే దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా ప్లాట్లలో విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ లైన్ల ఏర్పాటుతో పాటు త్రాగునీటి సరఫరా కోసం పైపులైన్ పనులు ప్రారంభించారు. ఇంటింటికి నల్లా లు ఏర్పాటుచేసి, శుద్ధమైన త్రాగునీరు అందించనున్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఈ పనులను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివసించబోయే లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌళిక వసతులను దశలవారీగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అర్హులైన 311 మంది నిరుపేదలకు ఈనెల 11న రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు ఇళ్ళ స్థలాల పట్టాలతో పాటు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 12న 38 మంది లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు చేసుకోగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని, వెలుగుమట్ల ఒక అందమైన కాలనీగా, రాష్ట్రంలోనే మోడల్ కాలనీగా అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నట్లు, ఆ దిశగా పనులు వెంటనే ప్రారంభించనున్నట్లు హామీ ఇచ్చారు.


మిగతా లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్, త్రాగునీటి, పిల్లల చదువులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల వంటి మౌళిక సదుపాయాలను ప్రాధాన్యతగా కల్పించనున్నారు. పనులను పూర్తి నాణ్యతతో, త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.

Leave a Reply