ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

వాంకిడి నవంబర్ 4, (ఆంధ్ర‌ప్రభ) : నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని వాంకిడి మండలం జైత్పూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జైత్పూర్ గ్రామం మొదటి విడత ఇందిరమ్మ మోడల్ గ్రామంగా ఎంపికైందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసి ఇండ్ల ప్రారంభానికి సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము చివరి దశలో ఉండడం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతి రోజు కుటుంబ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించి లబ్ధిదారులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పి. డి. వేణుగోపాల్, ఇంజనీరింగ్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply