
india vs pak|మరో ఐదు రోజుల్లో బిగ్‌వార్
india vs pak|మరో ఐదు రోజుల్లో బిగ్‌వార్
- భారత్, పాక్ మ్యాచ్ యథాతథం
- భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడతామన్న పాకిస్థాన్
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాక్ ప్రభుత్వం
- ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్
మరో ఐదు రోజుల్లో పెద్ద యుద్ధమే రాబోతోంది. ప్రపంచ మొత్తం హైవోల్టేజీ వార్‌ను చూసేందుకు రెడీ అవుతుంది. ఒకవైపు రాకెట్లా దూసుకొచ్చే బంతులు… మరోవైపు పదునైన కత్తుల్లాంటి బ్యాట్లతో బ్యాటర్ల కత్తిసాము… తిలకించేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. మాటకు మాట.. ఢీ అంటే ఢీ.. అనేందుకు దాయాదులు సిద్ధమవుతున్నాయి. ఎవరు వికెట్ల వీరులు.. ఎవరు సిక్సర్ల విధ్వంసకులు అనేది మరో ఐదు రోజుల్లో తేలిపోనుంది. దాయాదుల పోరులో ఎవరిది పైచేయి అనేది తెలవడానికి ఐదు రోజులు వేచి చూడాలి. ఐసీసీ ఈవెంట్లో తమదే ఆధిపత్యమని నిరూపించుకునేందుకు భారత్ సిద్ధమవుతుండగా.. ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది.

india vs pak|ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : టోర్నీ ఏదైనా భారత్, పాక్ మ్యాచ్ అంటే ఎక్కడలేని క్రేజ్ వస్తుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ఎప్పటిలాగే దాయాది దేశంపై గెలుపొంది పైచేయి సాధించాలని టీమ్ఇండియా ఉవ్విళ్లూరుతోంది. భారత్‌కు షాక్ ఇవ్వాలని పాక్ యోచిస్తోంది. దీంతో ఇరు జట్ల పోరుపై తీవ్ర ఆసక్తి నెలకొంది.అయితే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌పై కొన్ని వివాదాల కారణంగా నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతుందో లేదోననే అనుమానాలు కలిగాయి. అయితే ఎట్టకేలకు ఈ ఉత్కంఠకు తెరపడింది. మ్యాచ్ ఆడటానికి పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిగొచ్చిన పాక్
భారత్‌తో మ్యాచ్ ఆడే విషయమై కొన్ని రోజులపాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ మధ్య చర్చలు జరిగాయి. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై పునరాలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని విజ్ఞప్తి చేశాయి. భారత్‌తో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్‌కు తాను కోరినట్లు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ వెల్లడించారు. అలాగే క్రీడా స్ఫూర్తి దృష్ట్యా మ్యాచ్ ఆడాలని బీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత వెంటనే పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన కొద్ది సేపటికే భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు తిరస్కరించినందుకు బంగ్లాదేశ్‌పై ఎలాంటి ఆంక్షలు, జరిమానాలు విధించబోమని ఐసీసీ తెలిపింది.

బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు కోరడంతో..
భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించారు. దీనికి సంఘీభావంగా తాము భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ మ్యాచ్ ఆడి తీరాలని పాక్‌ను కోరాయి. శ్రీలంక అధ్యక్షుడు కూడా పాక్ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడటంతో ఈ సంక్షోభం ముగిసింది. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంతో, శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది. పాకిస్థాన్ తన టోర్నమెంట్ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటుందని ఐసీసీ కూడా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.

భారీ నష్టం నుంచి తప్పించుకున్న ఐసీసీ
దాయాదుల పోరుతోనే ఐసీసీ, ఆతిథ్య దేశం, బ్రాడ్‌కాస్టర్ తదితర విభాగాలకు భారీ ఆదాయం సమకూరుతుంది. అయితే పాక్ ఈ మ్యాచ్ ఆడబోమని ప్రకటించిన తర్వాత భారీ నష్టం తప్పదేమో అని అంతా భావించారు. కానీ పాక్ తాజా డెసిషన్‌తో ఐసీసీ భారీ నష్టం నుంచి తప్పించుకుంది. భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే అధికారిక ప్రసారదారు జియోస్టార్‌కు నష్టం వాటిల్లుతుంది. వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని జియోస్టార్ కోల్పోతుంది. అలాగే గేట్ మనీ (టికెట్ అమ్మకాలు), స్పాన్సర్‌షిప్స్ వంటి వాటిలో నష్టపోతుంది. దీంతో ఐసీసీని జియోస్టార్ రిబేట్ అడిగే అవకాశం ఉంది. అయితే భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఓకే చెప్పడంతో ఐసీసీ 174 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 1560 కోట్లు) నష్టం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
