కోయదొర వేషధారణలో..

కోయదొర వేషధారణలో..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కోయదొర వేషధారణలో కుర్రో కుర్రో.. అంటూ డ్రగ్స్, గంజాయి, రోడ్డు భద్రత పై చౌటుప్పల్ పట్టణంలో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినూత్నంగా కుర్రో కుర్రో.. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు.. సమ్మక్క సారక్క పలుకు, శ్రీశైలం మల్లన్న పలుకు, కొరివి వీరన్న పలుకు, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను కుర్రు, కొండ దేవత కుర్రు రామన్న, లచ్చుమన్న సల్లంగా సూత్తూరు అంటూ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో జరిగే వారసంత సందర్భంగా కుర్రో కుర్రో అంటూ కోయదొర వేషధారణలో గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలు, గంజాయి సేవించడం వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని, యువత వాటికి దూరంగా ఉండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రణాళిక బద్దంగా కష్టపడి లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అంటూ కరపత్రాలు భక్తులకు పంచుతూ ఫ్లెక్సీలు, మైక్ సెట్ ద్వారా డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అదే విధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని కోరారు. మరుగున పడుతున్న జానపద కళలను కూడా కాపాడేందుకు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

Leave a Reply