ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 7 (ఆంధ్రప్రభ): మైలవరం నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వర్షం మామిడి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులకు రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో భారీగా మామిడి కాయలు రాలిపోయాయి.
రెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా మామిడి తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. సోమవారం పగలంతా భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా సాయంత్రం వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై అకస్మాత్తుగా ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు పశ్చిమ ఇబ్రహీంపట్నంలో చెట్లు విరిగిపడ్డాయి. బూడిద రహదారిపై ప్రయాణించే చోదకులపై ఎత్తిపోసింది. ఆయా మండలాల్లో రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో అంధకారం ఏర్పడింది. ప్రజలు అవస్థలు పడ్డారు.