సలేశ్వరం జాతర డ్యూటీ … హోంగార్డు ఆత్మహత్య

సలేశ్వరం జాతర డ్యూటీ … హోంగార్డు ఆత్మహత్య
అచ్చంపేట, ఆంధ్రప్రభ : సలేశ్వరం జాతర డ్యూటీ విషయంలో మనస్థాపానికి గురైన వాచ్‌మన్ తిరుడు బయన్న (44) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అచ్చంపేటలో కలకలం రేపింది. బుధవారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో పట్టణ శివారులోని పశువుల సంత సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అచ్చంపేట ఎస్సై సద్దాం తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలం, చెంచుగూడానికి చెందిన తిరుడు బయన్న కోడేరు మండలంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
సలేశ్వరం జాతర సందర్భంగా అధికారులు అతనికి డ్యూటీ కేటాయించారు. బయన్న విధులకు హాజరు కాకపోవడంతో అధికారులు అతని డ్యూటీని ‘ఆబ్సెంట్’గా నమోదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న బయన్న మనస్థాపానికి గురై పశువుల సంత సమీపంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సద్దాం తెలిపారు. మృతునికి ఒక భార్య, వివాహితులైన ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు కలరు.
