చారిత్రక అవశేషాలను కాపాడుకోవాలి
అచ్చంపేట , ఆంధ్రప్రభ : చారిత్రక అవశేషాలైన వెయ్యేళ్ల నాటి పాదాలు, శివలింగాలు సంరక్షించాలని పునరావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి(Doctor Emani Shivanagi Reddy) పిలుపునిచ్చారు. అచ్చంపేట మండలానికి సమీపంలోని కొండనాగుల గ్రామం పురాతన చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది.
గ్రామ శివారులో గంగాగౌరీ రామలింగేశ్వరాలయం సమీపంలో బండపై చెక్కిన పాదముద్రలు, ఆరు చిన్న శివలింగాలు కనుగొన్నారు. ఈ చారిత్రక అవశేషాలను తక్షణం సంరక్షించాల్సిన అవసరం ఉందని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి సూచించారు.
స్థానిక దేవాలయ కమిటీ అధ్యక్షుడు అంబటి లింగమయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, “ఈ శిల్పాలు కళ్యాణీ చాళుక్యుల కాలం (సుమారు క్రీస్తుశకం 11వ శతాబ్దం) నాటివి కావచ్చు. అప్పటి శిల్పకళా వైభవాని(a master of sculpture)కి ఇవి సాక్ష్యం” అని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాలు నిర్లక్ష్యానికి గురైతే భవిష్యత్తులో మునుపటి కీర్తి చెదిరిపోతుందని హెచ్చరించారు.
“ అవగాహన లోపం వల్ల ఈ పురాతన అవశేషాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, పురావస్తు శాఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కాట్రాజు తిరుపతయ్య, అంబటి నరసింహ, నిమ్మల రాజు, తెలుగు ఎల్లయ్య, శిల్పి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

