OIL PALM | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు

  • రైతులు ఆర్థికంగా ఎద‌గ‌డానికి సహకార సంఘాలు దోహదం
  • ఎమ్మెల్యే విజయ రమణారావు

OIL PALM | కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : రైతులు ఆర్థికంగా ఎద‌గ‌డానికి సహకార సంఘాలు దోహదపడతాయని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతు వేదికలో అఖిలభారత సహకార వారోత్సవాలలో భాగంగా ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ప్ర‌ధాని జవహర్ లాల్ నెహ్రూ సన్న చిన్నకారు రైతుల కోసం సహకార సంఘాలను ఏర్పాటు చేసి సబ్సిడీ ద్వారా విత్తనాలు వ్యవసాయ పనిముట్లు అందించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేశాడన్నారు. పండిట్ నెహ్రూ జన్మదినం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వారు అఖిలభారత సహకార వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

రైతులకు సాగునీరు అందించేందుకు జవహర్ లాల్ నెహ్రూ ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణం కోసం పునాది వేస్తే ఇందిరా గాంధీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి కాలువల ద్వారా రైతుల పంటలకు సాగునీరు అందించిందన్నారు. రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేయడం వలన తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సహకారంతో పెద్దరాతుపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రూ.120 కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉపాధి దొరుకుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటే వ్యవసాయంపై అవగాహన లేని బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలపై కోత విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు కోతలు విధించకుండా కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తిపై ఆకాంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీమాల, డీఏఓ శ్రీనివాస్, హెచ్‌ఓ మహేష్, ఏడీఏ శ్రీనాథ్, మానిట‌రింగ్ ఆఫీసర్ ఇమ్రాన్, సింగిల్ విండో ఏవో నాగార్జున, చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, సీఈవో కొల్లేటి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply