హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఆగస్టు 13నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో, ఇప్ప‌టికే వారం రోజులుగా వానలు దంచేస్తుండ‌గా.. మ‌రో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కాగా, ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, బాచుపల్లి, మియాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, చెర్లపల్లి, ఉప్పల్, కుతుబుల్లాపూర్, అత్తాపూర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది.

ఉదయం ఎండతో మేఘావృత వాతావరణం ఉండగా, సాయంత్రానికి భారీ వర్షం కురిసి నగరాన్ని తడిపేసింది. ఫలితంగా పలు రహదారులు జలమయమై, ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, రాత్రి 12 గంటల తర్వాత కూడా నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply