TG | కుల‌గ‌ణ‌న అంతా త‌ప్పుల త‌డ‌క‌ – మాజీ మంత్రి త‌ల‌సాని

ఇదో కాంగ్రెస్ ప్ర‌భుత్వ కుట్ర‌పూరిత కార్య‌క్ర‌మం
ప్ర‌తి గ్రామంలోనూ జ‌నాభాను త‌గ్గించేశారు
త‌ప్పులు స‌రిచేసి బీసీల‌కు న్యాయం చేయాలి
కేంద్రంపై ఒత్తిడితోనే బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్
దీని కోసం అన్ని పార్టీల‌ను క‌లుపుకుపోవాలి
సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి త‌ల‌సాని సూచ‌న

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : కుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరిత కార్యక్రమంగా మార్చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మండిప‌డ్డారు. అందుకే త‌మ‌తో పాటు అన్ని బీసీ సంఘాలు కూడా మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో , పట్టణాల్లో సర్వే ఎక్కడా సరైన రీతిలో జరగలేదని, అరవై లక్షల జనాభాను తక్కువ చేసి చూపారని అన్నారు. ఎన్నికల ఓటర్ లిస్ట్ ప్రకారం చూసినా కులగణన లెక్కలు తప్పు అని తేలిపోయిందన్నారు. జనాభా తక్కువుంటే కేంద్ర నిధులు తక్కువగా వస్తాయన్న సోయి కూడా ప్రభుత్వం మరిచిపోయిందన్నారు.

నియోజకవర్గాల డీలిమిటేషన్‌లో జనసంఖ్య తక్కువ ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. శాస్త్రీయంగా సర్వే జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని త‌ల‌సాని పేర్కొన్నారు. కుల‌గ‌ణ‌న చేసి రేవంత్ చేతులు దులుపుకుంటే తాము చూస్తు ఊరుకోబోమ‌ని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టబద్దత చేస్తే లాభం లేదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. దీని కోసం అన్ని పార్టీల‌ను క‌లుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని రేవంత్‌కు సూచించారు. కేసీఆర్ గతంలోనే బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేశారని గుర్తు చేశారు. బీసీలు అడుక్కు తినేవాళ్లు కాదని, తామెంతో తమకంత అని బీసీలు నినదిస్తున్నారన్నారు.

17న కేసీఆర్‌ జ‌న్మ‌దిన వేడుక‌లు
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దారని, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నామని, కేక్ కటింగ్‌తో పాటు కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీని ఈ సందర్భంగా విడుదల చేస్తున్నామని, ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తలసాని వెల్లడించారు. ఈ కార్యక్రమాలను బీఆర్ఎస్ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *