హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాయ
నేటి నుంచి ఆన్ లైన్ టికెట్ అమ్మకాలు
సైట్ ఓపెన్ చేసే లోగానే సోల్డ్ ఔట్ బోర్డులు
గత సీజన్ లోనూ ఇదే సీన్
ఇప్పుడు అదే రిపీట్ .. మండిపడుతున్న అభిమానులు
హైదరాబాద్ – ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇక 27న లక్నోతో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. ఉప్పల్ మైదానంలో జరగనున్న ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్స్ నేడు అందుబాటులోకి వచ్చాయి.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఐపీఎల్ టికెట్స్ సేల్ షురూ అయింది. ఫ్యాన్స్ టికెట్ల కోసం వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. సేల్ షురూ అయ్యాక కొద్ది నిమిషాలకే సైట్లో సోల్డ్ ఔట్ చూపించేసింది. . కేవలం 10 వేలు, 21 వేల రూపాయల టికెట్లు మాత్రమే బుకింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా 7 నిమిషాల తర్వాత అందుబాటులో లేకుండా పోయాయి. తక్కువ ధర ఉన్న రూ.700 టికెట్లు మొత్తం బ్లాక్ లేదా సోల్డ్ ఔట్ అని చూపిస్తోంది. దాంతో హైదరాబాద్ ఫాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ సీజన్‌లోనూ బ్లాక్ దందానే’
క్షణాలలో టికెట్స్ మాయం కావడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు.. ఈ సీజన్ లోనూ బ్లాక్ దందానే అంటూ నిప్పులు చెరుగుతన్నారు. ‘ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తీరు మారదా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హెచ్‌సీఏ సిబ్బంది కొందరు బ్లాక్ దందాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ టికెట్స్ విషయంలో ఎలాంటి అవకతవలకు అవకాశం ఇవ్వనని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చెప్పినా.. సాధారణ అభిమానికి మాత్రం నిరాశే ఎదురవుతోంది. ఇక ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారు క్యూఆర్ కోడ్ చూపించి ఫిజికల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ టికెట్స్ కోసం ఎల్బీ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్, గచ్చిబౌలి స్టేడియంలో హెచ్‌సీఏ కౌంటర్స్ ఏర్పాటు చేసింది. ఈనెల 23న ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ కాబట్టి ఫాన్స్ చాల మంది టికెట్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. హైదారాబాద్ నగరంలో మొత్తం 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 7 లీగ్ మ్యాచ్‌లు కాగా.. 2 క్వాలిఫైర్ మ్యాచ్‌లు ఉన్నాయి. మిగిలిన ఏడు మ్యాచ్ లు టికెట్స్ అయినా సక్రమంగా అమ్మేలా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు..