Harish Rao | దశ, దిశ లేకుండా అసెంబ్లీ సమావేశాలు

Harish Rao | దశ, దిశ లేకుండా అసెంబ్లీ సమావేశాలు
Harish Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్ర అసెంబ్లీ నిర్వహణపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సభ సమయాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీ నిర్వహణ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు సభను నడుపుతూ, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశమివ్వడం లేదని విమర్శించారు.
టీ బ్రేక్ పేరుతో ఒకరోజు ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నారని, మరొకరోజు కేరళ నుంచి వస్తున్నారని చెప్పి గంటల తరబడి సభను నిలిపివేశారని ఆరోపించారు. అలాగే ఒకరోజు పెండ్లి కారణంగా, మరోరోజు ఆర్థిక మంత్రి సిద్ధమవుతున్నారని చెబుతూ సభను ఆపేశారని అన్నారు.
“సభకు వచ్చి ప్రిపేర్ అవుతారా? లేక ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా?” అని ప్రశ్నించిన ఆయన, విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇవ్వడం పేరుతో కూడా నాలుగు గంటలు వృథా చేశారని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వివిధ కారణాలతో అసెంబ్లీ సమయాన్ని వృథా చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
శాసనసభలో పహిల్వాన్లు అని రేవంత్ రెడ్డి అంటాడు, కత్తులతో తలలు తీసేస్తామని ఇంకో సభ్యుడు అంటాడు. మరి ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయరా? రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అనాగరిక భాష మాట్లాడాడు, మరి అది రిఫర్ చేయరా ఎథిక్స్ కమిటీకి? మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
