GP Election | మూడో విడతకు సర్వం సిద్ధం

GP Election | మూడో విడతకు సర్వం సిద్ధం

  • 114 గ్రామాల్లో పంచాయితీ పోరు
  • 1,59,289 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగం
  • పోటీలో 338 మంది సర్పంచ్ అభ్యర్థులు
  • ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : పారదర్శకంగా, పకడ్బందీగా మూడో విడత (చివరి దశ) పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆరు మండలాల్లో బుధవారం చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆలేరు నియోజకవర్గంలోని రెండు మండలాలు, మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలు, తుంగతుర్తి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది.

జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఎ.భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వీరారెడ్డి, డీపీవో విష్ణువర్ధన్‌రెడ్డి సారథ్యంలో ఎన్నికల నిర్వహణ జరుగనుంది.

ఆరు మండలాల్లో ఎన్నికలు..

మూడో విడతలో భాగంగా ఆరు మండలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని మూటకొండూర్, గుండాల మండలాల్లో 40 గ్రామాలుండగా, రెండు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 38 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల్లోని 27 గ్రామాల్లో, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లోని 57 గ్రామాలకు గాను 8 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 49 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

మొత్తం 124 సర్పంచ్ స్థానాలకు గాను 10 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. జిల్లావ్యాప్తంగా 114 గ్రామ పంచాయతీలు, 1,086 వార్డులకు గాను 93 వార్డులు ఏకగ్రీవమవగా, 993 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

పోలింగ్, కౌంటింగ్ అదే రోజు..

బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌కు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్‌ను ఎన్నికల సంఘం కేటాయించింది.

ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తారు. అదే రోజు సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఓటరు జాబితా ప్రకారం బీఎల్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశారు.

విధుల్లో 2,457 మంది సిబ్బంది

మూడో విడత ఎన్నికల నిర్వహణ కోసం వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 2,457 మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో 26 మంది జోనల్ అధికారులు, 119 మంది స్టేజ్-2 అధికారులు, 1,056 మంది పీవోలు, 1,256 మంది ఓపీవోలు విధుల్లో ఉంటారు.

పోలింగ్ నిర్వహణకు అవసరమైన 52 రకాల సామగ్రిని ఇప్పటికే మండల కేంద్రాలకు చేరవేసి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా సిబ్బందికి అందజేశారు.

వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

జిల్లాలో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 37 సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. ప్రతి మండలంలో ఒక మోడల్ (గ్రీన్) పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 1,59,289 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 79,364 మంది పురుషులు, 79,925 మంది మహిళలు ఉన్నారు.

మండలాల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా ..

గుండాల – 26,069
మూటకొండూర్ – 20,901
చౌటుప్పల్ – 37,893
సంస్థాన్ నారాయణపూర్ – 38,189
మోత్కూర్ – 13,215
అడ్డగూడూర్ – 23,022

10 పంచాయతీలు ఏకగ్రీవం

మూడో విడతలో 124 పంచాయతీలకు గాను 10 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో ఐదు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవమవగా, మరో ఐదు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు.

చౌటుప్పల్ మండలంలోని దామెర, ఎల్లగిరి, ఎల్లంబావి; సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని గంగముల తండా, కడపగండి తండా, పల్లగుట్ట తండా, రాచకొండ, వాచ్య తండా; మూటకొండూర్ మండలంలోని కొండాపూర్, పెద్దబావి గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.

114 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు గాను 338 మంది అభ్యర్థులు, 993 వార్డులకు గాను 2,395 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Leave a Reply