GOVT | రైతులకు నష్టపోకుండా చూడాలి
మొక్కజొన్నకు మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
GOVT | కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు ప్రకటించిన కనీస మద్దతు ధరకు (MSP) తగ్గకుండా ట్రేడర్లు కొనుగోలు చేసి, రైతులు నష్టపోకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ పంటలకు మార్కెటింగ్ విధానం పై ట్రేడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కజొన్నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 కనీస మద్దతు ధరను నిర్ణయించిందని తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్నను ఈ ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ట్రేడర్లను ఆదేశించారు. దీనిపై వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రైతులకు తూకాల్లో మోసాలు జరగకుండా యంత్రాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో తూకాల యంత్రాలలో లోపాలు గమనించి సంబంధిత వారికి జరిమానాలు విధించామని కలెక్టర్ తెలిపారు.
అనంతరం ట్రేడర్లు మాట్లాడుతూ రైతులకు నష్టం రాకుండా కనీస మద్దతు ధరకు అనుగుణంగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు.. , నగరంలోని లారీ అసోసియేషన్ రవాణా ధరలను అధికంగా నిర్ణయించడంతో తమకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఎల్డీఎం రామచంద్ర రావు, ఉద్యాన శాఖ అధికారి రాజ కృష్ణారెడ్డి, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.


