Global AI Hub | నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్
- ప్రధాని మోదీ, రాహుల్, ఖర్గేలతో భేటీ!
Global AI Hub | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేడు (డిసెంబర్ 2) రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు.. రేపు (బుధవారం) ఉదయం నుంచి ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్-2026కు ప్రముఖులను ఆహ్వానించనున్నారు.
ఈ పర్యటనలో ఆయన పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా వారికి అధికారికంగా ఆహ్వాన పత్రికలు అందజేయనున్నారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా గ్లోబల్ ఏఐ హబ్(Global AI Hub)గా మార్చాలనే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే దేశ రాజకీయ నాయకత్వం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అధికారిక ఆహ్వానంతో పాటు, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా కేంద్ర పథకాల కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.

