Medchal | సైకో వీరంగం – చిన్నారి బ‌లి

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్‌ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన హప్నహెమ్‌బ్రూమ్‌(30) అనే యువకుడు శుక్రవారం అక్కడే పనిలో చేరాడు. అయితే హప్న ఉన్నట్టుండి శ‌నివారం నాడు సైకోగా మారాడు

.లేబర్‌ క్యాంప్‌లో ఆడుకుంటున్న చిన్నారి రియాకుమారి తలపై హప్న బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. ఆకస్మిక ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది.

పోచారంలో సూర్య హాస్పిటల్ ఎదురుగా రోడ్డుపైకి వచ్చిన సైకో వీరంగం సృష్టించాడు. పలు కార్లను ధ్వంసం చేశాడు. రోడ్డుపై నిలబడి ఎవరు వస్తే వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి.ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో చుట్టుపక్కల జనాలు సైకోను చితకబాది అదుపులోకి తీసుకొచ్చారు. జనాలు తలో చేయి వేయడంతో స్పృహ కోల్పోయాడు సైకో. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోచారం సీఐ రాజు వర్మ ఘటనపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత సైకోను తాళ్లతో బంధించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *