గిట్టుబాటు ధరను పొందండి..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి(Chintala Damodar Reddy) తెలిపారు. మండలంలోని నక్కలగూడెం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఈ రోజు సంఘం చైర్మన్ దామోదర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని శుభ్రపరచుకొని రాళ్లు, మట్టి పెడ్డలు లేకుండా చూసుకోవాలని, తేమశాతం 17 లోపు వచ్చేటట్టు తమ ధాన్యాన్ని ఎండ బెట్టుకోవాలన్నారు. అనుకోకుండా వర్షాలు కురుస్తున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మార్కెట్ కు తీసుకువచ్చిన ధాన్యంపై కవర్లు కప్పుకోవాలని, ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2389 లు, బి గ్రేడ్ ధాన్యానికి రూ. 2369 లు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నట్లుగా తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు(Mutyala Nagaraju) మాట్లాడుతూ.. రైతులు తాము వేసుకున్న పంటలకు వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి నమోదు చేయించుకోవాలని, తమ ఆధార్ కార్డులకు ఫోన్ నెంబర్లను లింక్(Link) చేయించుకోవాలని ఏవో నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సౌమ్య, సంఘం డైరెక్టర్ దుర్గ కృష్ణ, సంఘం కార్యదర్శి వై రమేష్, రైతులు యాస అశోక్ రెడ్డి, యాస బుచ్చిరెడ్డి, జి జంగయ్య, శ్రీశైలం, సిబ్బంది డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.