మాంసం, మద్యం విక్రయాలపై ప్రభావం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దసరా పండగ (Dussehra festival) అనగానే తెలంగాణ (Telangana) ప్రజలకు ముఖ్యమైన పండగ. రాష్ర్టవ్యాప్తంగా దసరా వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ ఆటపాటలు, దుర్గామాత విగ్రహాల ప్రతిష్ఠ, కొత్త బట్టల కొనుగోళ్లు, బంధువుల రాకపోకలతో పట్టణాలు, పల్లెలు పండగ వేళ సందడిగా మారుతాయి. దసరా రోజు ఆయుధ పూజ, జమ్మి చెట్టుకు పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే బంధువులు విందు వినోదాల్లో మునిగిపోతారు. దసరా రోజు మాంసం, మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. కానీ ఈ సారి దసరా అక్టోబరు 2 వచ్చింది. అదేరోజు గాంధీ జయంతి (Gandhi Jayanti) వచ్చింది. సాధారణంగా గాంధీ జయంతి రోజు మాంసం, మద్యం విక్రయాలు జరపొద్దని నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది గాంధీ జయంతి రోజు దసరా రావడంతో వీటి విక్రయాలపై నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గాంధీజీ సిద్ధాంతాలను గౌరవిస్తూ, హింసకు తావు లేకుండా గురువారం దసరా రోజు మాంసం క్రయవిక్రయాలు జరిపితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

దసరా అంటే తెలంగాణలో ప్రజలకు చాలా పెద్ద పండగ. గాంధీజయంతి రోజునే విజయదశమి కూడా ఉండటంతో మద్యం (alcohol,), మాంసం (meat) విక్రయాలపై జనాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా మహాత్మా గాంధీ జయంతి రోజున ఈ రెండు రకాల విక్రయ దుకాణాలు మూసివేస్తారు. కానీ పండగ రోజు మాంసాహారులైన ప్రతి ఇంట్లో మంచి విందుభోజనం ఉండాల్సిందే. అందుకు జీవాలు, నాటు కోళ్లు, బాయిలర్, చేపల (fish)కు కూడా డిమాండ్ ఉంటుంది. జిల్లాల్లోని పల్లెల్లోనూ సామూహికంగా మేకలను వధించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. దసరా అంటేనే ముక్క, చుక్క అనే భావన తెలంగాణ ప్రాంతంలో ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా పండుగ రోజు మాంసం విక్రయాలు, మూగజీవుల వధ ఆపడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దసరా రోజు రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రూ.కోట్లలో మద్యం అమ్మకాలు జరుగుతాయి. తెలంగాణలో దసరా రోజు కిటకిటలాడే మద్యం దుకాణాలు మొట్టమొదటిసారి విలవిలబోనున్నాయి. మున్సిపల్ సిబ్బంది ఈ ఆదేశాల అమలును పటిష్టంగా పర్యవేక్షిస్తారు. ఆదేశాలను ఉల్లంఘించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగా గండి పడటం ఖాయం. అయితే చాలామంది దసరా ముందు రోజే మాంసం, మద్యం కొనుగోలు చేసుకుంటున్నారు. ఇళ్లలో స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఇక గ్రామాలలో సామూహికంగా మేకలను కోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి మాంసం, మద్యం విక్రయ వ్యాపారులకు ఈ దసరా కొంత నిరాశను కలిగిస్తుందని చెప్పవచ్చు.


