KTR | అస్తవ్యస్తంగా టెక్స్ టైల్ పార్క్ పనులు
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్లు
దేశానికే ఆదర్శం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్
మాజీ మంత్రి కేటీఆర్
KTR | సంగెం, ఆంధ్రప్రభ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు (Mega Textile Park) ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, పనులు పూర్తిచేయక అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ లో ఉన్న కిటెక్స్ కంపెనీ సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ సంగెం, గీసుకొండ మండలాల్లో 2017 సంవత్సరంలో నెలకొల్పినంటి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ దేశానికే ఆదర్శమన్నారు. ఆజామ్ జాహి మిల్లు పోయిన అనంతరం నెలకొల్పిన టెక్స్ టైల్ పార్క్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. రోడ్లు, కార్మికుల నివాస స్థలాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా లేదన్నారు. టెక్స్ టైల్ పార్కులో నెలకొల్పిన కంపెనీలు గణేష్ ఈటెక్, యంగ్ వన్, కైటెక్స్ కంపెనీలలో తయారైన దారం, వస్త్రాలు దేశానికే ఆదర్శమన్నారు.
దీనిలో తెలంగాణకు చెందిన ఎంతోమంది యువతీ యువకులకు ఉపాధి కలుగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో, రాబోయే తరాలకు ఇది ఒక గొప్ప అవకాశమని, వరంగల్లో నెలకొల్పిన మెగా టెక్స్ టైల్ పార్కు ( (Mega Textile Park) అన్నివర్గాల ప్రజలకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. దేశానికే ఆదర్శవంతమైన పార్కును కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుండి నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్లు మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) మోసం చేసిందని 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ బెంగాల్లో, ఢిల్లీలో చెప్పి మోసం చేశారని, దీనికి రాహుల్ గాంధీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కొన్ని మండలాల్లో పూర్తిగా బీసీలకు ఒక్క సీటు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. పార్టీ ఎన్నికలు కాకుండా పార్టీ రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇచ్చామని చెప్పుకోవటం కాంగ్రెస్ కు సిగ్గుగా అనిపించడం లేదా అని విమర్శించారు. తెలంగాణ (Telangana) ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు మోసపోరని సమయం వచ్చినప్పుడు కాలోజీ చెప్పిన విధంగా పగబట్టి బుస కొడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ లందరూ కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మొద్దని వారికి సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొనుకటి రాణి మొగిలి తదితరులు పాల్గొన్నారు.

