Forest Department | 3,462 కిలోమీటర్ల పరిధిలో 1,076 ఉచ్చులు తొలగింపు

Forest Department | 3,462 కిలోమీటర్ల పరిధిలో 1,076 ఉచ్చులు తొలగింపు
- ‘క్యాచ్ ద ట్రాప్’ కార్యక్రమంలో హైటికోస్ కీలక పాత్ర
Forest Department | అచ్చంపేట, ఆంధ్రప్రభ : వన్యప్రాణులను ఉచ్చుల నుంచి రక్షించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రతిష్టాత్మక ‘క్యాచ్ ద ట్రాప్’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికోస్) స్వచ్ఛంద సంస్థ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులతో కలిసి విస్తృతంగా చర్యలు చేపడుతోంది. 2024 నుంచి ఇప్పటివరకు అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూరు, అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల్, దోమలపెంట, నాగర్‌కర్నూల్ ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో మొత్తం 3,462 కిలోమీటర్ల నడక మార్గాన్ని పరిశీలించి 1,076 ఉచ్చులను గుర్తించి తొలగించారు.
వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదని, వన్యప్రాణుల సంరక్షణే మన సంరక్షణ అని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్‌స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి తెలిపారు. జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, అమ్రాబాద్ డివిజనల్ అధికారి, అచ్చంపేట డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తొలగించిన ఉచ్చులను అటవీ శాఖకు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని హైటికోస్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట రేంజ్ అధికారి మహమ్మద్ అబ్దుల్ సుబూర్, సెక్షన్ అధికారి సుజాత, హైటికోస్ అధికారులు అఖిల్ గౌడ్, శ్రీకాంత్, వికాస్, స్నేక్ క్యాచర్ సుమన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
