Cotton | ఆంధ్రాపత్తిపై అమెరికా కత్తి….

  • భారీగా పెరుగుతున్న విదేశీ దిగుమతులు
  • సవాలక్ష నిబంధనలతో మద్దతు ధరలకు కోతలు
  • ఆదుకోవాలని కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులు

అమరావతి, ఆంధ్రప్రభ: మొంథా తుపాను ధాటికి తడిసిపోయిన పత్తిని అమ్ముకోలేక, సీసీఐ సహాయ నిరాకరణతో కుదేలైన రైతులకు అమెరికా నుంచి వస్తున్న పత్తి కొంప ముంచుతోంది. పైగా ఈ ఏడాది పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం సుంకాన్ని పూర్తిగా తగ్గించడంతో ఇబ్బడిముబ్బడిగా అమెరికా నుంచి పత్తి వచ్చేస్తోంది. ఏకంగా దిగుమతుల్లో వందశాతం రెట్టింపు నమోదవడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇది దేశీయ పత్తి రైతును దారుణంగా దెబ్బతీస్తోంది. తేమ, గ్రేడింగ్‌ పేరుతో సీసీఐ దేశీయ పత్తి రైతులనుంచి కొనుగోళ్ల విషయంలో మెలిక పెడుతూ మద్దతు ధర ఇవ్వడం లేదు. అటు ప్రకృతి, ఇటు ప్రభుత్వం నుంచి సహాయం లభించకపోవడంతో పత్తి రైతులు విలవిలలాడుతున్నారు. మొంథా ప్రభావంపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను కేంద్రబృందాలు స్వయంగా పరిశీలించిన తరువాత కూడా సీసీఐలో మార్పు రాకపోవడం విడ్డూరం. పత్తి కొనుగోలుపై కాటన కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కఠినంగా వ్యవహరిస్తోంది.

సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలరోజులు దాటినా రైతుల నుంచి సేకరించిన పత్తి చేతికందిన పంటతో పోలిస్తే 10 శాతం కూడా లేదు. అందులోనూ సవాలక్ష నిబంధనలు, తేమ పేరుతో కోతలు, 12 శాతం దాటితే కొనుగోలుకు తిరస్కరణలు..మోంథా తుపాను ధాటికి పంటంతా తడిసిపోయింది.

తేమ నిబంధనలు సడలించి మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని రైతులు గగ్గోలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడులు శక్తివంచన లేకుండా కేంద్రంతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు.

నిబంధనలు సడలించాలని లేఖలు కూడా రాశారు. ఎందువల్లనో పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం గడిచిన నెల రోజులుగా నిబంధనల్లో ఒక్క సడలింపునకు కూడా ఆస్కారం ఇవ్వలేదు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి పత్తి రైతులతో మాట్లాడారు.

సీసీఐ నిబంధనలపై ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తుపాను ధాటికి పత్తి ఎలా దెబ్బతిందో కేంద్ర బృందం స్వయంగా పరిశీలించినా నిబంధనల్లో సడలింపు రాలేదు. తేమ శాతంలోనే కాదు.. కొనుగోలు పరిమాణం, కపాస్‌ కిసాన్‌ యాప్‌ నిబంధనలు, ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3, ఎల్‌ 4 గ్రేడింగ్‌ విధానం, ధరల తగ్గింపు నకు అనుసరిస్తున్న విధానాలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల గోడును ఎవరూ పట్టిం చుకోకపోవటానికి దేశీయ పత్తికి భారీగా డిమాండ్‌ తగ్గటమే కారణమని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. అమెరికా నుంచి వచ్చే పత్తిపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయటమే ప్రస్తుత మార్కెట్‌ సంక్షోభానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

మార్కెట్లో బాగా డిమాండ్‌ ఉన్న బిన్ని, బ్రహ్మగా పి లిచే పొడుగు గింజ పత్తి (ఈఎల్‌ఎస్‌)నే ఏపీ, తెలం గాణ రైతులు అత్యధికంగా పండిస్తున్నారు. ఆ తరు వాత ఎంఈసీహెచ్‌ గా పిలిచే మధ్య రకం పత్తిని కూడా పండిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పత్తిలో 90 శాతం ఇక్కడి రైతులు పండించే పొడుగు గింజ (ఈఎల్‌ఎస్‌) పత్తి రకమే ఉంటుంది.

అమెరికాలో ఈఎల్‌ఎస్‌ పత్తిని పూర్తిస్థాయిలో ప్రాసెస్‌ చేసి ఇక్కడి వస్త్ర పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా పంపిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పత్తిలో 95 శాతం ప్రాసెస్‌ చేసిందే కావటం వస్త్ర పరి శ్రమలకు మరింత అనుకూలంగా ఉందని ట్రేడర్లు చెబుతున్నారు. పత్తిపై అతి తక్కువ దిగుమతి సుం కాలు అమల్లో ఉన్నపుడే మార్కెట్‌ లో ధరలు పడి పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగం ఇపుడు సుంకాలను పూర్తిగా ఎత్తివేయటంతో ఒక్కసారిగా కుదే లయింది.

అందులోనూ పంట చేతికంది అమ్ముకునే దశలో దిగుమతి సుంకాలను ఎత్తివేయటం దేశీ యంగా పత్తి పండించిన రైతులకు ఆశనిపాతంగా మారింది. మన దేశానికి అత్యధికంగా అమెరికా నుంచే పత్తి దిగుమతి అవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌లోని భారీ వస్త్ర వ్యాపారులంతా అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవటానికే మొగ్గు చూపుతున్నారు.

దిగుమతి సుంకాలు లేనందున ఒక వైపు విదేశాల నుం చి తక్కువకు పత్తిని కొనుగోలు చేస్తూ మరో వైపు పరో క్షంగా దేశీయ పత్తిని భవిష్యత్‌ అవసరాల కోసం కారు చౌకగా కొనుగోలు చేసి నిల్వ చేసుకునే ఎత్తుగడ కొనసా గుతుందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

టెక్స్టైల్‌ రంగానికి చెందిన కార్పొరేట్‌ కంపెనీలు పత్తిని నిల్వ చేసుకునేందుకూ, తేమ శాతాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు అత్యాధునిక గోడౌన్లనూ, సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకుని రైతుల నుంచి కారుచౌకగా పంటను కొనుగోలు చేసేందుకు మార్కెట్‌ మాంద్యాన్ని సృష్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం పత్తిపై దిగుమతి సుంకాన్ని 30 శాతం వరకు విధించటంతో పాటు- కాటన్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నిబంధనలను సరళతరం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

అమెరికా నుంచి భారీగా దిగుమతులు

దేశవ్యాప్తంగా 345 లక్షల ఎకరాల్లో పత్తి సాగవు తుండగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌ లలో పత్తి అత్యధికంగా సాగవుతుంది. ఏటా సుమారు 350 లక్షల బేళ్లు ( ఒక్కో బేల్‌ 170 కిలోలు) ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ ఏడాది ఏపీలో 5 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా సుమారు 8 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా.

పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం సుంకాన్ని తొలుత ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు పూర్తిగా తొలగించిన కేంద్ర ప్రభుత్వం ఆ తరువాత డిసెంబరు 31 వరకు పొడిగించింది. 2023-2024 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి పత్తి దిగుమతుల విలువ 579.2 మిలియన్‌ డాలర్లు. 2024-2025 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి 107 శాతం పెరిగి 1.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

2024 మొదటి అర్ధ సంవత్సరం ముగిసిన జూన్‌ 30 నాటికి పత్తి దిగుమతుల విలువ 86.89 మిలియన్‌ డాలర్లు.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో పత్తి దిగుమతులు 181 మిలియన్‌ డాలర్లకు చేరువయ్యాయి. ఇది గత ఏడాది (2024) తొలి ఆరు నెలలతో పోలిస్తే 109 శాతం ఎక్కువ.

ఈ ఏడాది ఆగస్టు నుంచి దిగుమతులపై ఉన్న 11 శాతం సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసింది. ఈ ఏడాది రెండవ అర్ధ సంవత్సరంలో జులై మినహా మిగతా అయిదు నెలల పాటు పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండవ అర్ధ సంవత్సరంలో దిగుమతులు తొలి అర్ధ సంవత్స రం కంటే అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని పత్తి వ్యాపారుల అంచనా. అంతేకాదు..ఈ ఏడాది డిసెంబరు 31వరకు అమల్లో ఉన్న దిగుమతి సుంకాల ఎత్తివేత వచ్చే ఏడాది ఆర్ధిక సంవత్సరం ముగిసే వరకు మరో మూడు నెలల పాటు- మార్చి 31వరకు పొడిగించే అవకాశం ఉందని కాటన్‌ ట్రేడ్‌ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.

Leave a Reply