గోదావరిఖని (పెద్దపల్లి జిల్లా) : విస్తారమైన వర్షాల కారణంగా శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బుధవారం వరద తాకిడి పెరుగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 7 గేట్లనే ఎత్తి దిగువకు 59095 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను ఎత్తి 86775 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కు సంబంధించిన 24 గేట్లను ఎత్తి దిగువకు 1,32,392 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి మరింతగా పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామీణ ప్రాంత ప్రజానీకాన్ని అధికారులు అలర్ట్ చేస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలోని చెరువులు, కాల్వలోని వరద నీరు అంతా కూడా రిజర్వాయర్ లోకి చేరింది. 148.00 ప్రాజెక్ట్ లెవెల్ కాగా 147.68 లెవెల్ లో ప్రస్తుతం నీటి సామర్థ్యం ఉంది. 20.175 (శతకోటి ఘనటపు అడుగులు ) టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 19.2863 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కి రోజువారీగా 288 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నంది మేడారం పంప్ హౌస్ నుండి 3150 క్యూసెక్కుల నీటిని సరఫరా జరుగుతుంది.
భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లనే ఎత్తి ఒక లక్ష పైచిలుకు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉధృతిని ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తున్నారు. మరో మూడు రోజులపాటు విస్తారమైన వర్షాలు ఉన్న కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని పల్లె ప్రజానీకానికి వరద తాకిడితో సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం ప్రజానీకాన్ని అప్రమత్తం చేస్తుంది.