Fire Accident |కోల్‌కతా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం – 14 మంది దుర్మరణం

కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

కోల్‌కతా సీపీ మనోజ్‌ కుమార్‌ వర్మ మాట్లాడుతూ.. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో రితురాజ్‌ హోటల్‌ ఆవరణలో మంటలు చెలరేగాయని సమాచారం అందిందని చెప్పారు. ఆ తర్వాత పలువురు భవనం కిటికీలు, ఇరుకైన గోడల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. నాలుగో అంతస్తు నుంచి పలువురు కిందకు దూకగా గాయపడ్డారని చెప్పారు. ప్రమాదంలో 14 మంది మృతదేహాలను వెలికి తీశామని.. చాలామందిని రక్షించినట్లు తెలిపారు.

మంటలను అదుపులోకి తీసుకువచ్చామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణాలు తెలియవన్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు సంభవించాయని అనుమానిస్తున్నట్లు చెప్పారు

Leave a Reply