కర్నూలు బ్యూరో, మే 18: ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న తగరం గోపాల్ కు ఆర్థిక సహాయం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సహాయంగా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తగరం గోపాల్ కు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. శనివారం కర్నూలు నగరంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా దేవనకొండ మండలం నేలతల మర్రి గ్రామ నివాసి తగరం సువర్ణమ్మ తన భర్త తగరం గోపాల్ రక్త సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇందుకు సంబంధించి ఇంజెక్షన్లకు రూ.12లక్షలు ఖర్చవుతుందని వేలూరు సీఎంసీ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారని, ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.
వెంటనే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సువర్ణమ్మ భర్త వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తగరం గోపాల్ తమ్ముని కుమారుడు తగరం దినకర్ కు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా తగరం సువర్ణమ్మ కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్న తమను ముఖ్యమంత్రి ఆదుకున్నారని, వారు చేసిన మేలు మరిచిపోలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చెక్ అందించిన జిల్లా కలెక్టర్ కు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.