Extra Budget | ప్రత్యేకంగా రక్షణ పద్దు – మరో ₹50వేల కోట్లకు ప్రతిపాదనలు

ప్రధానితో భేటీతో త్రివిధ దళాధిపతులు ప్రస్తావన
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదానికి చాన్స్​
సైనిక బలం వృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ:

ఆపరేషర్ సిందూర్‌తో భారతదేశం రక్షణ కవచంలో సైనిక బలం.. బలగం సత్తా, సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు అంచనా వేశాయి. ఇక భారత ప్రభుత్వం కూడా ఈ బలాన్ని బలగాన్ని మరింత పదును పెట్టేందుకు కొత్త పద్దును తెరుస్తోంది. సైనిక బలగాలను పెంచాలి. ఆయుధాలు సమకూర్చాలి. తిరుగులేని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి. భారత్ వైపు శత్రువులు కనీసం తొంగి చూడ్డానికి వీలు లేకుండా.. మేడ్ ఇన్ ఇండియా ఆయుధ సామర్థ్యాన్ని మరింత తీర్చిదిద్దేందుకు అనుబంధ బడ్జెట్టును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టనుందని సమాచారం.

వెపన్​ టెక్నాలజీ పెంచుకునేందుకు..

ఆపరేషన్ సిందూర్‌లో మేడ్ -ఇన్ -ఇండియా ఆయుధాల విశ్వసనీయత ప్రపంచానికి తెలిసింది. 21వ శతాబ్దపు యుద్ధంలో మేడ్ ఇన్ -ఇండియా రక్షణ పరికరాల సత్తాను ప్రపంచం గుర్తించింది. ఇదే అంశాన్ని ప్రధాని మోదీ ప్రజలకు వివరించారు. ఆకాశ్, బ్రహ్మోస్.. ఇలా మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు పాక్ భూతలాన్ని కకావికలం చేశాయి. ఇక ఈ స్థితిలో సైనిక బలగాలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరించటానికి అనుబంధ బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ₹50వేల కోట్ల అదనపు కేటాయింపులతో కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.

శీతాకాల సమావేశాల్లో ఆమోదించే చాన్స్​..

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ రక్షణ అనుబంధ బడ్జెట్టుకు ఆమోదం లభించవచ్చు. ఈ అదనపు కేటాయింపులతో, సాయుధ దళాల అవసరాలు, పరిశోధన . సాంకేతిక అభివృద్దికి కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రక్షణ కోసం రికార్డు స్థాయిలో ₹6.81 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 9.53 శాతం ఎక్కువ. ప్రస్తుతం బలాన్ని మరింత మెరుగుపర్చేందుకు అదనపు బడ్జెట్ అవసరమని ఇటీవల ప్రధాని మోదీతో భేటీలో త్రివిధ దళాదిపతులు ప్రస్తావించారని తెలుస్తోంది.

Leave a Reply