పార్కింగ్ టోల్ టెండర్‌ తో భారీ ఆదాయం.

పార్కింగ్ టోల్ టెండర్‌ తో భారీ ఆదాయం.

ఇంద్రకీలాద్రి పార్కింగ్ టోల్ టెండర్ ఖరారు..
రూ.2.46 కోట్లకు ఖరారు
గత ఏడాదితో పోలిస్తే గణనీయ వృద్ధి

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి లోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల వాహనాల పార్కింగ్ టోల్ రుసుము వసూలు హక్కుల కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి టెండర్ ప్రక్రియ మంగళవారం నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో జరిగిన ఈ వేలం పాటలో గట్టి పోటీ నెలకొంది. సీల్డ్ టెండర్ ప్రక్రియలో సిఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.2,21,21,555/-కు దరఖాస్తు చేయగా, ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.2,22,29,999/-ను కోట్ చేసింది.

అనంతరం నిర్వహించిన బహిరంగ వేలంలో సి ఎస్ ఆర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రూ.2,46,00,000/-కు హెచ్చు పాట పాడి టెండర్‌ను దక్కించుకుంది. గత 2025-26 సంవత్సరంలో ఇదే టెండర్ రూ.1,74,90,000/-కు ఖరారైన సంగతి తెలిసిందే. కాగా మార్చి 23న నిర్వహించిన తొలి వేలంలో రూ.2,01,00,000/- వరకు మాత్రమే ధర రావడంతో తగిన స్థాయిలో లేదని భావించిన ఆలయ అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు తిరిగి నిర్వహించిన ఈ వేలంలో ఆశించిన స్థాయిలో ధర రావడంతో టెండర్‌ను ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్, సభ్యులు పి. రాఘవరాజు, ఎ. శ్రీనివాసరావు, అధికారులు రంగారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply