engagement | రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

engagement | రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
engagement | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిశ్చితార్థానికి సిద్ధమవుతున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలోనే కాకుండా గ్రామంలోనూ శోకసంద్రం నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన గొడ్డు గొర్ల ప్రసాద్ (28) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పెయింటర్‌గా పనిచేస్తున్న అతనికి ఇటీవలే వివాహం నిశ్చయమై, గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది.
మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రసాద్ మద్దులపల్లి స్టేజ్ సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అతడిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేపే నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో మద్దులపల్లి గ్రామంలో దుఃఖఛాయలు నెలకొన్నాయి.
