తేమ శాతం ఆంక్షలతోనే పత్తి రైతు దగా..!

తేమ శాతం ఆంక్షలతోనే పత్తి రైతు దగా..!
సీసీఐ నిబంధనలు సడలించి అన్నదాతను ఆదుకోవాలి..!.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఒరిగేదేమీ లేదు..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : అతివృష్టి, అకాల వర్షాలతో పంట దిగుబడి లేక, మార్కెట్ కు తెచ్చిన పత్తి సరుకును తేమశాతం సాకుతో కొనుగోలు చేయక రైతును నిలువునా దగా చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) మండిపడ్డారు. ఈరోజు అదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎడ్లబండి ఎక్కి పత్తి మార్కెట్ కు వెళ్లారు. అక్కడ రైతులు ఆరబెట్టిన పత్తి నిల్వలను, మొక్కజొన్న సరుకును పరిశీలించి కొనుగోళ్ల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, ఇటీవల కురిసిన ఆకాల వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిందని మార్కెట్కు తీసుకువస్తే 12 శాతం మించి తేమ ఉందని చెప్పి కొనుగోలు చేస్తలేరని రైతులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో 20 శాతంపైనే తేమ ఉంటుందని, తేమ నిబంధనలను సడలిస్తేనే పత్తి రైతులు బతకగలుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

పత్తి రైతును చూస్తే కళ్ళకు నీళ్లు వస్తున్నాయి..!
పత్తి రైతుల పరిస్థితి (condition of cotton farmers) చూస్తే కడుపు తరుక్కుపోతుంది.. కళ్ళకు నీళ్ళోస్తున్నాయి.. అయినా పాలకుల కు మాత్రం జాలి కలగడం లేదు.. రైతు ఉసురు తగలడం ఖాయం అంటూ కవిత ఉద్వేగంగా మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల వల్లే ఈసారి పత్తిలో తేమశాతం పెరిగిందని ఎమ్మెల్యే, ఎంపీ బిజెపి నుండి గెలిచినా కేంద్రాన్ని ఒప్పించుకోలేకపోతున్నారని కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో పత్తితోపాటు సోయాబీన్, మొక్కజొన్న, వరి ధాన్యం కళ్ళల్లో ఆరబెడుతూ రైతులు అవస్థలు పడుతున్నారని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అదిలాబాద్ మార్కెట్లో తేమశాతం నిబంధనలు సడలించి 20 నుండి 25 శాతం తేమ ఉన్నా రైతుల నుండి పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదిలాబాద్ మార్కెట్లో హమాలి ఆడబిడ్డలను తొలగించడంపై అధికారులపై మండిపడ్డారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు కవిత విన్నవించారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలపై అంత హడావుడి వద్దు..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills by-election) పైనే ప్రధాన రాజకీయ పార్టీలు సవాలుగా తీసుకొని ప్రచారం చేస్తున్నాయని, ఈ ఎన్నికలతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని కవిత అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల ప్రజా ప్రతినిధులు రైతు సమస్యలపై దృష్టి సారించి వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. కెసిఆర్ పాలనలో మార్కెట్ కు వచ్చిన ప్రతి గింజ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల గురించి పట్టించుకోకపోతే వారి ఉసురు తగలడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు.

బతుకమ్మ ఆడిన కవిత..
ఆదిలాబాద్ తెలంగాణ చౌక్ లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే కొద్దిసేపు మహిళలతో బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత చెనక కొరట ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు.
