- ఓయూ విద్యార్థులకు సీఎం పిలుపు
- నేను మీ వాడిని… నన్ను అడగండి
అధికారం కోల్పోయారన్న బాధ, కడుపు మంటతో ఉన్న రాజకీయపార్టీ ఉచ్చులో పడొద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓయూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తాను ఎక్కడి నుంచో పుట్టుకు రాలేదని, మీ వాడిగా పుట్టుకొచ్చి మీ ఆశీస్సులతో సీఎం అయ్యాయనని అన్నారు. ఈ రోజు యూనివర్సిటీ పరిధిలోని రూ.80 కోట్లతో హాస్టల్ భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఓయూ విద్యార్థులు (Osmania University Students) వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని అన్నారు. ఇప్పటికే ఉద్యోగాలు కూడా ఇచ్చానని తెలిపారు. ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి నిబంధనలు ఉంటాయని, ఆ నిబంధనల మేరకు నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. తమ తాత, తండ్రి కూడా ముఖ్యమంత్రి కాదని, చెట్టు పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.
అన్ని వద్దు అంటున్నారు…
ఏ మంచి పని చేసినా ఆ రాజకీయ పార్టీ వద్దంటున్నారని పరోక్షంగా బీఆర్ఎస్‌పై సీఎం (CM) మండిపడ్డారు. గంజాయి నిర్మూలనకు ఈగల్ టీమ్ ఏర్పాటు చేస్తే ఆ పార్టీ వద్దంటుందని, హైడ్రా (Hydra) కూడా వద్దంటుందన్నారు. పేదోడికి రేషన్ కార్డు ఇవ్వొద్దు, సన్నబియ్యం పంపిణీ చేయొద్దు ఇలా ప్రతి పనికీ అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. ఏదీ చేసినా వద్దు అని చెబుతున్న వారు తెలంగాణకు పట్టిన చెద అని అన్నారు. అలాంటి చెదను తొలగిస్తే తప్ప తెలంగాణ బాగుపడదని అన్నారు.
ఫామ్ హౌస్లో మానవ రూపంలో మృగాలు ఉన్నాయి…
సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు, సింహాలు, ఇలా ఉన్నాయని వారు చెబుతున్నారని తెలంగాణలో ఒక్క ఏనుగు , సింహం కూడా లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క ఫామ్ హౌస్ (Farm house) లో మాత్రమే మానవ రూపంలో మృగాలు ఉన్నాయని, వాటి పని పట్టాలని అన్నారు.
ఓయూకు ఏదీ కావాలన్నా ఇస్తా…
ఓయూకు ఏదీ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తాను మళ్లీ ఓయూకు వస్తానని, ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెడతానని, ఆ రోజు క్యాంపస్‌లో ఒక్క కానిస్టేబుల్ కూడా ఉండదని చెప్పారు. ఆ రోజు విద్యార్థులు స్వేచ్చగా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పొచ్చన్నారు. విద్యార్థులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని అన్నారు.