మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా (Narayanpet District) మక్తల్ (Maktal) ప్రజలను వీధి కుక్కలు (Dogs) హ‌డ‌లెత్తిస్తున్నాయి. ఒంటరిగా రోడ్లపైకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా సంచ‌రిస్తూ పిల్లలను, పెద్ద‌ల‌పైకి ఎగ‌బ‌డి క‌రుస్తున్నాయి. కుక్క‌ల దాడిలో అనేక మంది గాయపడిన సంఘటనలున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మక్తల్ మున్సిపాలిటీ (Municipality) కేంద్రంలో పెద్ద ఎత్తున కుక్కలు సంచరిస్తున్నా మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

గురువారం రాత్రి రాఘవేంద్ర థియేటర్ (Raghavendra Theatre) సమీపంలో మౌలాలి మసీదు వద్ద ఐదారు కుక్కలు కలిసి మేకపై దాడి చేసి చంపి తిన్నాయి. మక్తల్ మున్సిపాలిటీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మునిసిపల్ కమిషనర్ (Municipal Commissioner), సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మటన్ మార్కెట్ (Mutton Market)లో అయితే కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అర్ధరాత్రి వేళ అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) వరకు కుక్కలు గుంపులుగా ఉండి భ‌య‌పెడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్క‌ల బెడ‌ద లేకుండా చూడాల‌ని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply