తొమ్మిదివ రోజు సద్దుల బతుకమ్మ.. ఏమేమి చేస్తారో తెలుసా !!

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు చివర రోజుకు వచ్చేశాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజుల పాటు ఘ‌నంగా వేడుక‌లు జ‌రిగాయి. ప్రతీరోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చుతూ నైవేద్యాలు సమర్పించారు మహిళలు.

ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మ అని పిలుచుకుంటారు. ముందు ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకల కంటే ఈరోజు సద్దుల బతుకమ్మను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. చాలా పెద్ద పెద్ద బతుకమ్మలను పేరుస్తారు. అలాగే పసుపుతో తయారు చేసిన గౌరమ్మను బతుకమ్మ వద్ద ఉంచుతారు.

తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో చివరి రోజు ఎంతో ప్రత్యేకం. ఈరోజు ఐదు రకాల నైవేద్యాలను గౌరమ్మకు సమర్పిస్తారు. ముందుగా రాగి పల్లెంలో ఆకులు వేసి.. దానిపై కుంకమ, పసుపు వేస్తారు. ఆ తరువాత గునుగు పువ్వును ఒక వరుసగా పేర్చి.. దానిపై బంతిపూలు, చామంతులు ఇలా అనేక రకాల రంగు రంగుల పూలతో పేరుస్తారు.

అలాగే గునుగు పువ్వుకు రంగులు అద్ది పేరుస్తుంటారు. అలాగే బతుకమ్మ మధ్యలో వివిధ రకాల పూల రెక్కలు, ఆకులతో నింపుతుంటారు. ఈ విధంగా త్రికోణంలో లేదా వలయాకారంలో తయారు చేస్తారు. కొంతమంది నిలువెత్తు బతుకమ్మను తయారుచేసి మురిసిపోతుంటారు. పలువురు చాలా పెద్ద బతుకమ్మ చేసేందుకు రంగురంగుల కాగితాలను కూడా ఉపయోగిస్తుంటారు.

తీరొక్క పువ్వుతో బతుకమ్మను తయారు చేస్తారు. ఆ తరువాత పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ వద్ద ఉంచుతారు. తయారు చేసిన బతుకమ్మను దేవుడి మందిరంలో ఒక పీట వేసి దానిపై పసుపు, కుంకుమతో ముగ్గువేసి అక్కడ బతుకమ్మను ఉంచుతారు. ఆపై అగరొత్తులు వెలిగిస్తారు. అనంతరం తయారు చేసిన ఐదు రకాల నైవేద్యాలను గౌరమ్మకు సమర్పిస్తారు.

పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మలీద ముద్దలను నైవేద్యంగా సమర్పిస్తారు. మలీద ముద్దలు అంటే గోధుమ పిండితో చపాతీలు చేస్తారు. ఆపై చపాతీలను ముక్కలుగా చేసి బెల్లం, సోంపు వేసి బాగా కలిపి వాటిని ముద్దలుగా కడతారు. ఈ పదార్థాన్నే మలీద ముద్దలు అని పిలుస్తారు. సాయంత్రం వేళ ఇంటి ముందు కల్లాపి చల్లి, ఎర్రమట్టితో అలికి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. దానిపై తాము సిద్ధం చేసిన బతుకమ్మ, గౌరమ్మ, నైవేద్యాలను ఉంచుతారు. చుట్టుపక్కల మహిళలంతా కలిసి బతుకమ్మ చుట్టూ ఆడి పాడతారు.

బతుకమ్మకు సంబంధించి ఎన్నో పాటలు పాడతారు. ఒక్కో ఇంటి ముందు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడి పాడతారు. ఆపై మహిళంతా కలిసి బతుకమ్మను తీసుకుని దగ్గరలోని చెరువు, నదిలో నిమజ్జనం చేస్తారు. చెరువులో నీటిని తీసుకుచ్చి మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు.

ఈ సమయంలో కూడా ప్రత్యేకమైన పాటలు పాడతారు మహిళలు. ఆపై నైవేద్యాలను పంచిపెడతారు. ఇంతటితో సద్దుల బతుకమ్మ సంబురాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు అత్తవారింటి నుంచి పుట్టింటి వచ్చి మరీ బతుకమ్మలను పేర్చుతూ కన్నవారితో, తోటబుట్టిన వారితో ఆనందాలను పంచుకుంటూ బతుకమ్మ సంబురాల్లో పాలుపంచుకుంటారు.

Leave a Reply