1.20 Lakhs Acres Ditwah | రైతుల గుండెల్లో..
- ఖరీఫ్ రైతులను వెంటాడుతున్న వర్షాలు..
- జల్లులతో నిలిచిన వరి కోతలు..
- వరి కోత యంత్రాలు వెనక్కి వెళ్లే ప్రమాదం..
- తేమ శాతంతో రైతులకు ఇబ్బంది..
1.20 Lakhs Acres Ditwah | రైతుల గుండెల్లో.. | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్ లో వరుస అల్పపీడనాలు, తుపాన్లు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెలలో మొంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు 70 వేల ఎకరాల్లో వరిచేలు నేలమట్టమయ్యాయి. అనంతరం నవంబర్ లో ఏర్పడిన అల్పపీడనాలు అంతగా ప్రభావం చూపకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పల్లపు ప్రాంతాల్లోని కోతకు వచ్చిన వరి చేలలో నేటికీ వర్షాల వల్ల ఏర్పడిన బురద తగ్గకపోవడం, చేలు ఆరకపోవడంతో వరికోతల సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చేలలో చెమ్మ ఉండడంతో వరి కోత యంత్రాలు దిగబడిపోయి వరి కోతకు రెట్టింపు సమయం పట్టడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేపట్టారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోని 2.11 లక్షల ఎకరాలలో సాగు చేశారు. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 91 వేల ఎకరాల్లో మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. ఇంకా 1.20 లక్షల ఎకరాల్లో వరికోతలు పూర్తి కావాల్సి ఉంది.
1.20 Lakhs Acres Ditwah | జల్లులతో నిలిచిన వరి కోతలు..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను కారణంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న చిరుజల్లులతో ఎక్కడిక కక్కడ వరి కోతలు వాయిదా పడ్డాయి. వరి చేలు వర్షానికి తడిచిపోవడంతో యంత్రాలతో వరి కోతలు కోసే వీలు ఉండదు. ఇప్పటికే ఆలస్యమైన వరి కోతలు ఈ వర్షాల కారణంగా మరో మూడు, నాలుగు రోజులు ఆలస్యం అయితే.. మరింత నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కోతలు నిలిస్తే.. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన వరి కోత యంత్రాలు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

1.20 Lakhs Acres Ditwah | ధాన్యం లో తేమ శాతంతో సతమతం..
వాతావరణం మబ్బులతో నిండి చల్లగా ఉండటం, జల్లులు కురుస్తుండడంతో ధాన్యంలో తేమశాతం తగ్గనంటూ రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్ రైతులు వరి కోతలను ముమ్మరంగా చేపట్టారు. కోసిన ధాన్యాన్ని సమీపంలోని కళాల్లోకి గట్ల పైకి రహదారుల వద్దకు చేర్చి ఆర పెడుతున్నారు. ఈ సమయంలో కురుస్తున్న చిరుజల్లులతో ధాన్యాన్ని ఆరబెట్టే అవకాశం కూడా లేదు. ఈ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగితే ఇప్పటికే గట్ల పై, రహదారుల్లో రాశులలో తేమ శాతం మరింత పెరిగి రంగు మారే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం 17 శాతం లోపు తేమ ఉంటే ధాన్యానికి మద్దతు ధర అందుతుంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ధాన్యంలో తేమశాతం 20 శాతానికి పైగా ఉంటుంది. ఈ తేమ శాతానికి తగ్గించడానికి కనీసం నాలుగు రోజులైనా ఆరుబయట ఆర పెట్టాల్సి ఉంటుంది.
1.20 Lakhs Acres Ditwah | 10 ఎకరాల్లో కౌలు వ్యవసాయం
నేను 10 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేశాను. ఇప్పటి వరకు 6 ఎకరాల్లో మాత్రమే యంత్రంతో వరి కోతలు పూర్తయ్యాయి. కోసిన పంటను ఆరబెట్టేందుకు వాతావరణ మబ్బులు, జల్లులు కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని… వర్షాల వల్ల ఇంకా 4 ఎకరాల్లో వరి పంట చేలలోనే ఉండిపోయింది. తేమ శాతంలో నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతు కమజ ఏడుకొండలు తెలియచేశారు.

1.20 Lakhs Acres Ditwah |తేమ శాతం ఉన్న కొనుగోలు – జేసీ

దిత్వా తుఫాను ప్రభావంతో కురుస్తున్న జల్లుల కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరిగే అవకాశం ఉంది. ధాన్యంలో నిబంధనల ప్రకారం 17 శాతం కన్నా తేమ శాతం అధికంగా ఉన్న కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాం. ధాన్యంలో తేమశాతం ఎక్కువ ఉన్న పాయింట్ల ప్రకారం ఒక్కో పాయింట్ కేజీ చొప్పున కటింగ్ విధిస్తారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు ఎవరైనా ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటి వరకు సుమారు రూ.300 కోట్ల నగదును ఆయా రైతుల ఖాతాలకు జమ చేశామని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

