District SP | నేరాల నియంత్రణకు కఠిన చర్యలు

District SP | నేరాల నియంత్రణకు కఠిన చర్యలు

  • పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశాలు

District SP | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతం, ప్రజల భద్రత పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహ సమావేశ మందిరంలో ఇన్‌స్పెక్టర్లు, పై స్థాయి అధికారులతో నేరసమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలని, ప్రజలకు కనిపించే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, చట్టంపై గౌరవం పెరిగేలా వ్యవహరించాలని, అక్రమ రవాణా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు.

District SP

నేరాలు, నేరస్తుల వివరాలు నమోదయ్యే కేంద్ర సమాచార వ్యవస్థలో డేటాను తక్షణమే, క్రమం తప్పకుండా నవీకరించాలని స్పష్టం చేశారు. ప్రతి మార్పును వెంటనే నమోదు చేసి, నేరాలు, నిందితుల వివరాలు సరిగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం ప్రతి కేసులో దర్యాప్తు క్రమబద్ధంగా, నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తి చేయాలని, ఫిర్యాదు నమోదైన వెంటనే ఆధారాలు సేకరించడం, సాక్షులను విచారించడం, న్యాయ వైద్య నివేదికలు త్వరగా పొందడం వంటి ప్రక్రియలు వేగవంతం చేయాలని సూచించారు.

నిర్ణీత గడువులోపు చార్జ్‌షీట్ కోర్టులో దాఖలు చేయాలని, ఆలస్యం జరిగితే బాధితులకు నష్టం కలుగుతుందని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల అణచివేతకు డ్రోన్ల ద్వారా నిఘా పెంచాలని తెలిపారు. పెద్ద సభలు, ర్యాలీలు, వాహన రాకపోకల నియంత్రణ, అటవీ ప్రాంతాల పర్యవేక్షణ, అక్రమ మద్య తయారీ కేంద్రాల గుర్తింపు వంటి అంశాల్లో డ్రోన్లు ఉపయోగపడతాయని వివరించారు.

District SP

పెండింగ్‌లో ఉన్న తీవ్రమైన, సాధారణ కేసులు, హత్య, దోపిడీ, దొంగతనం, వాహనాల చోరీ, గల్లంతైన వ్యక్తుల కేసులు, మోసాలు, సైబర్ నేరాలు తదితర అంశాలను సమీక్షించారు. పోలీసు స్టేషన్ వారీగా కేసుల స్థితిగతులు, అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై అధికారులతో చర్చించి, కేసు దస్త్రాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల ఛేదింపుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. దొంగతనాలు జరిగిన వెంటనే సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను సమీకరించి నేరస్తులను పట్టుకోవాలని, దొంగిలించిన సొమ్ము పూర్తిగా రికవరీ చేయాలని ఆదేశించారు.

కోర్టులో నిందితులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు జరిపినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సందేశాలు, లింకులు, ఫోన్ కాల్స్‌ను నమ్మకూడదని హెచ్చరించారు. లోన్ పేరుతో వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. మోసానికి గురైన వారు వెంటనే 1930 సైబర్ సహాయ కేంద్రం, సైబర్ నేర నివేదిక వెబ్‌సైట్, జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్ 9440900005 లేదా సైబర్ మిత్ర 9121211100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మహిళలు, చిన్నారుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం పెరిగేలా సేవలు అందించాలని సూచించారు. ఈ నేరసమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ ఆపరేషన్స్ మరియు పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజశేఖర రాజు, జిల్లాలోని ఉపవిభాగ డీఎస్పీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply