ఆర్చరీ లీగ్ విజయంపై చర్చ!

దేశంలో మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంట్ అయిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) విజయాన్ని పురస్కరించుకుని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శనివారం గ్లోబ‌ల్ లీడ‌ర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా, మోడీ… రామ్ చరణ్ కు జ్ఞాపకార్థంగా వెంక‌న్న విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ భేటీలో క్రీడా స్ఫూర్తి, దేశీయ క్రీడల వారసత్వాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టడం వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించారు.

ఈ అరుదైన భేటీ గురించి రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. “ప్రపంచంలోనే తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను” అని చరణ్ తెలిపారు.

అనిల్ కామినేని నేతృత్వంలో ప్రారంభమైన ఈ లీగ్‌లో, క్రీడల పట్ల ప్రధానికున్న ఆసక్తి, మార్గదర్శకత్వం… ఆర్చరీ వారసత్వాన్ని ప్రపంచస్థాయిలో ప్రోత్సహించడానికి, పరిరక్షించడానికి తప్పక సహాయపడుతుందని చరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. “క్రీడాకారులందరికీ నా అభినందనలు! మరింత‌ మంది ఈ అద్భుతమైన క్రీడలో చేరి, తమ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాను” అని రామ్ చరణ్ పేర్కొన్నారు. కాగా, రామ్ చ‌ర‌ణ్ APL ఆర్చ‌రీ అంబాసిడర్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) ప్రత్యేకత

ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 2025లో అక్రోబ‌ర్ రెండున ప్రారంభ‌మైన ఈ లీగ్, దేశంలో ఆర్చరీకి కొత్త ఊపునిచ్చింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. అందులో పృథ్వీరాజ్ యోధాస్, మైటీ మరాఠాస్, కాకతీయ కైట్స్, రాజపుతానా రాయల్స్, చెరో ఆర్చర్స్ మరియు చోళ చీఫ్స్ జ‌ట్లు ఉన్నాయి.

ప్రతి జట్టులో నలుగురు పురుషులు, నలుగురు మహిళలతో సహా ఎనిమిది మంది ఆర్చర్లు ఉంటారు. ఇందులో దేశీయ ఆర్చర్లతో పాటు మొత్తం 12 మంది అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఎంపికయ్యారు.

ఫైనల్స్…

ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రౌండ్-రోబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశ ముగియగా, ప్రస్తుతం నాకౌట్ దశలు జరుగుతున్నాయి. తుది పోరుకు రాజపుతానా రాయల్స్ , మైటీ మరాఠాస్ జట్లు చేరుకున్నాయి. వీరు ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం తలపడనున్నారు.

Leave a Reply