Delhi Tour | రాహుల్,ఖర్గేలతో నేడు రేవంత్ భేటి
న్యూ ఢిల్లీ | ఏఐసీసీ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ నేడు సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేబినెట్‌లోకి ఎవరెవరు చోటు సంపాదిస్తారన్న దానిపై స్పష్టత రానుంది. మంత్రుల బృందం రూపకల్పనలో పాతనేతలకు పట్టం కడతారా? లేదా కొత్తవారికి అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
గత రాత్రి మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కులగణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్‌కు అందజేశామన్నారు. ఈ నివేదికను శాస్త్రీయంగా, సమగ్రంగా రూపొందించామని, ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ ఆమోదించిన తరువాత కేబినెట్‌లో ఆమోదముద్ర వేసిందని వివరించారు. రెండు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రజలు కోరుకుంటున్నారని, దీనిపై భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు తెలిపారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రకారం, రాహుల్ గాంధీ త్వరలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాష్ట్రంలోని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై శుక్రవారం రాహుల్ గాంధీతో మరింత స్పష్టత రానుంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర రాజకీయ చర్చల మధ్య ఉన్నారు. కేబినెట్ విస్తరణ, కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలు పార్టీకి కీలక మలుపు తీసుకురానున్నాయి. అధిష్ఠానం నుంచి వచ్చే నిర్ణయాలే తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు దిశను నిర్ణయించబోతున్నాయి.