Campaign End ఢిల్లీలో ముగిసిన ప్రచారం – ఎగ్జిల్ పోల్స్ పై నిషేధం …
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడింది. మొత్తం 70 స్ధానాలున్న అసెంబ్లీకి ఈ నెల అయిదో తేదిన పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.ఇక అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.
ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్, ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఫిబ్రవరి 5న పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల సమయంలో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలను గానీ, ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని ఈసీ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఎల్లుండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడులోని ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.