ఈ దుర్వార్తతో నాయనమ్మ గుండె ఆగింది
కడప , ఆంధ్రప్రభ బ్యూరో : ఏమి కష్టం వచ్చిందో.. ఏడాది బిడ్డ సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడగా.. ఈ దుర్వార్తను భరించలేక మరో కుటుంబ సభ్యురాలు గుండెపోటుతో మరణించింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు గాలిలో కలచిపోయాయి.
సభ్య సమాజం గుండెను నీరుగార్చిన ఈ విషాదం వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఓ కుటుంబం ఆత్మహత్యతో తీవ్ర విషాదం నెలకొంది. కడప నగరం నగరం శంకరాపురానికి చెందిన కుటుంబం కడప రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కుటుంబ తగాదాలతో రైల్వే స్టేషన్ మూడో నంబర్ ట్రాక్ పై భార్యా,భర్త తో పాటు ఒక ఏడాది వయసు కలిగిన బాబును కూడా పట్టుకుని ట్రాక్ పై నిలవడంతో వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే కుటుంబ సభ్యులు చనిపోయారు .మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
మృతుల్లో కుటుంబ యజమాని ధోని పత్రి శ్రీరాములు(27) భార్య ధోని పత్రి శిరీష (23 )తో పాటు ఏడాది వయసు కలిగిన కుమార్తె ధోని పత్రి రిత్విక్ (1)ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మృతదేహాలను గుర్తించి కడప రిమ్స్ హాస్పిటల్ కు రైల్వే పోలీసులు తరలించారు. కాగా ఈ కుటుంబం ఆత్మహత్యతో శ్రీరాములు నానమ్మ గుండెపోటుతో మృతి చెందారు.
ఆత్మహత్యకు కుటుంబ తగదాలేనా ఇంకా ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.