రైతుల డిమాండ్లకు సీఆర్డీయే ఓకే

30 ఎకరాల భూమికి అప్పగింతకు అంగీకారం

ఆంధ్రప్రభ, గుంటూరు( రూరల్ ప్రతినిధి) : అమరావతి (Amaravati ) బాలారిష్టాలు కరిగిపోతున్నాయి. రాజధాని అమరావతికి రాజమార్గం. ఇక కళకళలాడతుంది. బందరు టూ బొంబాయి వయా బెజవాడను కలిపే 9 వరసల సీడ్ యాక్సెస్ రోడ్డుకు బారికేడ్లు తొలగిపోతున్నాయి. ఒకటి అరా ఇక స్పీడ్ బ్రేకర్లనూ తొలగించటానికి సీఆర్డీయే అధికార దళం కృషి చేస్తోంది. NH-16 తో అనుసంధానంతో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మూడు రాష్ట్రాల ప్రజల్ని ఆర్థిక దిశ వైపు శరవేగంగా చేర్చుతుంది. ఇందులో డౌటనమానం లేదు.

అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ నకు ఉండవల్లి (undavalli) లోని రైతులు ససేమిరా అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఉండవల్లి భూముల రేట్లు.. రాజధాని గ్రామాల కన్నా పది రెట్లు ఎక్కువగా ఉన్నాయని.. అందుకని ఉండవల్లి గ్రామాన్ని స్పెషల్ గా పరిగణించి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించాలని ఉండవల్లి రైతులు అడ్డం తిరిగారు. ఆందోళనలు, పోరాటాలు చేశారు. అప్పట్లో వీరికి జనసేనని పవన్ కళ్యాణ్ కూడా అండగా నిలిచారు. అంతే సీడ్ యాక్సెస్ రోడ్డు కు ఉండవల్లిలో బారికేడ్ పడింది. ఈ పని పూర్తి కావటం ఓ కల గానే మిగిలిపోయింది.

ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇంటి సమీపంలోనే ఈ అడ్డంకి ఏర్పడింది. రాజధాని అమరావతికి సీడ్ యాక్సిస్ రోడ్డు ఏ మణిహారం కావటంతో ఈ రోడ్డు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొన్ని మెట్లు దిగొచ్చింది. రైతుల డిమాండ్లకు తలొగ్గింది. మరీ ముఖ్యంగా ఉండవల్లి భూములను స్పెషల్ క్యాటగిరీగా గుర్తించింది. రైతులు కోరిన సిక్స్ డిమాండ్స్ ను ప్రభుత్వం అంగీకరించింది. యాక్సిడ్ రోడ్డుకు బారికేడ్ గా మారిన 30ఎకరాల భూమిని ఇవ్వటానికి 37 మంది రైతులు ముందుకు వచ్చారు. మరో ఐదుగురు రైతులు కూడా 7 ఎకరాల భూమిని ఇస్తే రాజధాని సీడ్ యాక్సెస్ పనులు ఆరు నెలల్లో పూర్తి కావటం తథ్యం.

ఇటీవలే రైతులు సంతకాలు చేసి 9.3 ఒప్పంద పత్రాలను సీఆర్డీయే కమిషనర్ కన్నబాబుకి అందజేశారు… ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ భూమి విలువ తనకు తెలుసునని.. రైతులు భూమిని కన్నతల్లిలాగా చూసుకుంటారని… ఆ భూమి వారికి సర్వస్వం అని… అటువంటి భూమిని ప్రభుత్వాన్ని, తమను నమ్మి ఇస్తున్నందుకు.. రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

1) ఉండవల్లి గ్రామ పరిధిలో గ్రీన్ జోన్, యూ-1 జోన్ కోసం సీఆర్డీయేకి అవసరం మేరకు భూములను తీసుకుని మిగిలిన భూములను జోన్ల పరిధి నుంచి తొలగించాలి.


2) ప్రస్తుతం సీఆర్డీఏ పరిధిలో గృహ నివాస స్థలాలకు.. F. S. I. R 1.75%, 2%, 2.4%.. అమలులో ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చిన ఉండవల్లి రైతులకు.. F. S. I. R ను 4% గా పరిగణిస్తారు. అంటే ఒన్ ప్లస్ టూ స్థానంలో ఒన్ ప్లస్ ఫోర్ కు పర్మిషన్ ఇస్తారు.


3) సీడ్ యాక్సెస్ రోడ్డు కి భూములు ఇచ్చిన రైతులకు.. ఉండవల్లి గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని తొమ్మిది ఎకరాలలో వాణిజ్య స్థలాలను..N. C. L చెందిన ఆరు ఎకరాల 72 సెంట్లు భూమిలో ఇళ్ల స్థలాలను రైతులకు కేటాయించి అభివృద్ధి చేసి త్వరితగతిన అందజేయాలి.


4) ఈ షరతులకు అనుగుణంగా రైతులకు కేటాయించిన గృహ, వాణిజ్య స్థలాలను ఆరు నెలల్లో అభివృద్ధి చేసి రైతులకు అందజేయాలి.


5) సీడ్ యాక్సెస్ రోడ్డుకు మిగిలిన భూమిని తాత్కాలిక అవసరాల కోసం రేకుల షెడ్లు, గేదెల ఫారాలు, చిన్న గోడౌన్ల నిర్మాణానికి రైతులకు సీఆర్డీయే అనుమతులు ఇవ్వాలి.


6) చివరిగా.. ఈ షరతుల పురోగతిని బట్టి..9.14 అగ్రిమెంట్ అంటే తమ భూములను ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇస్తున్నట్లు అంగీకార పత్రం అందజేస్తారు. సకాలంలో షరతులు అమలు చేయక పోతే భూముల్ని వెనక్కి తీసుకుంటామని రైతులు స్పష్టం చేశారు.


ఈ ఆరు అంశాలపై అధికార యంత్రాంగం.. సానుకూలంగా స్పందించి ముందుకు వచ్చింది. మిగిలిన భూములను కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని.. సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు. సీఆర్డీయే అధికారులకు 9.3 ఒప్సంద పత్రాలను రైతులు అందజేసిన కార్యక్రమంలో సీఆర్ డీయే కమిషనర్ కన్నబాబు, తెలుగుదేశం మంగళగిరి రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ ముమ్మడి సత్యనారాయణ రావు, రాజధాని రైతులు ఈశ్వర్ రెడ్డి, ఉండవల్లి భాస్కర రావు, తమ్మ శ్రీనివాస రెడ్డి అంజి రెడ్డి, గోవింద రెడ్డి, నరేష్ రెడ్డి, బాలాజీ రెడ్డి, రాజధాని రైతులు పాల్గొన్నారు.

Leave a Reply