నల్లగొండ మంత్రులకు పదవులు ఉంటాయో ఊడుతాయో ?
ఇప్పటికే ఇంచార్జ్ పదవుల తొలగింపు
వారి చేతగానితనానికి నిదర్శనం.
పోలీసుల నుంచి మామూళ్లు వసూలు
ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా సమీక్షలు ఏంటి ?
ఉత్తమ్ కు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖపై కనీస అవగాహన లేదు
మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విమర్శలు
నల్లగొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ :
నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు (Two minister ) రానున్న రోజుల్లో మంత్రి పదవులు ఉంటాయో ఊడుతాయో తెలియకుండా ఉందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Jagadish reddy ) అనుమానం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చండూరు లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ ఇద్దరు మంత్రులకు ఉన్న జిల్లా ఇన్చార్జ్ (Incharge ) పదవులను తొలగించడం చూస్తుంటే వారి చేతగానితనానికి నిదర్శనంగా కనపడుతోందని అన్నారు. ఎమ్మెల్యేలను కూడా జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడనీయకుండా మంత్రులే పెత్తనం చెలాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రులు కనీసం ఎమ్మెల్యేలను కూడా మాట్లాడనీయకుండా అడ్డుకోవడం ఏం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ లు పని చేయ కున్నా పోలీసు శాఖ మాత్రమే చాలా చురుకుగా పనిచేస్తుందని ఎద్దేవా చేశారు.
జిల్లాకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు పోలీసుల నుండి మామూళ్ళు తీసుకోవడం వల్ల ప్రజాప్రతినిధులు అంటే ప్రజల్లో గౌరవం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పోలీసులు పని చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మంత్రులకు ఆయా శాఖలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారీ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (uttam kumar reddy ) ఆ శాఖలపై కనీస అవగాహన లేదు అని ఆయన విమర్శించారు. బి ఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవినీతికి పాల్పడేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులు పెడుతున్న అక్రమ కేసులకు తాము భయపడేది లేదని హెచ్చరించారు. చుండూరు మున్సిపల్ చైర్మన్ ఇంటిని కాంగ్రెస్ నాయకులు కేవలం రాజకీయ కక్షతోనే కూల్చివేశారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. బి ఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకే కాంగ్రెస్ నాయకులు కొత్త బోర్డులను తగిలించి తామే పనులను పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. పదేళ్ల బి ఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతాంగానికి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసామని కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద పెరిగిపోయిందని అన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కనీస సమీక్షలు కూడా చేయలేని అసమర్ధ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏలుతోందని ఆయన విమర్శించారు. పాలన చేతగాని సీఎం రేవంత్ రెడ్డి కృష్ణ, గోదావరి జలాలను ఆంధ్రకు అప్పజెప్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న సన్న వడ్ల బోనస్ ఏమైందని, రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయకుండా ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు పాల్వాయి స్రవంతి, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.