కర్నూల్ బ్యూరో : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘీక శక్తులకు అడ్డుకట్ట వేసి నేరరహిత జిల్లాగా తీర్చిదిదాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈసందర్భంగా శుక్రవారం కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు సబ్ డివిజన్ సిఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ, ఆర్ముడు పోలీసులు బృందాలుగా ఏర్పడి కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజఫర్ నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్స్, అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్, సమస్యాత్మక వ్యక్తుల ఇళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాతో గట్టి నిఘా ఉంచారు.
ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. వాహన పత్రాలు సరిగా లేని 19 బైక్‌లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ముజఫర్ నగర్ ప్రజలతో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ సమావేశం నిర్వహించారు. నేరాల అదుపునకు ప్రజల సహకారం అందించాలన్నారు. ఎవరూ చట్ట వ్యతిరేక కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదని, నేరాలు చేసే వారి గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీషీటర్లపై పీడీ యాక్ట్, జిల్లా బహిష్కరణ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో కర్నూల్ పట్టణ సీఐలు మదుసూధన్ గౌడ్, మన్సురుద్దీన్, శ్రీధర్, నాగశేఖర్, ఎస్‌ఐలు, 15మంది స్పెషల్ పార్టీ బృందాలు, డ్రోన్ కెమెరా, హోంగార్డులు మొత్తం 100మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.