కాంగ్రెస్.. అరాచకానికి నిదర్శనం..

కాంగ్రెస్.. అరాచకానికి నిదర్శనం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గజ్వేల్ లోని క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ తీవ్రంగా ఖండించారు. క్యాంప్ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు గోడల పై బలవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ అరాచకానికి నిదర్శనం అన్నారు. కైతానపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని, జీర్ణించుకోలేక ఈ రకమైన నీచ రాజకీయాలకు దిగిందన్నారు.
క్యాంప్ కార్యాలయాలు ప్రజాప్రతినిధుల నివాసాలే తప్పా ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టాలని ఎలాంటి నిబంధన లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. కేసీఆర్ కార్యాలయం పై దాడి చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని యాదయ్య గౌడ్ హెచ్చరించారు.
