వెలగపూడి – ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చ వంటివని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్రను పరిశీలిస్తే, ఉగ్రవాదం, హింస ద్వారా ఏ లక్ష్యాలు నెరవేరలేదని స్పష్టమవుతుందని అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు.. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మోడీకి అండగా ఉంటాం …
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం తీసుకుంటున్న దృఢమైన, నిర్ణయాత్మక చర్యలకు తమ సంఘీభావం ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఘోరానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.
తెలుగు వాళ్లు మరణించడం బాధకరం..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో చెందిన ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జె.ఎస్. చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ విషాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి, ఉగ్రవాదుల దాడిలో తెలుగు సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని ఆ కుటుంబాలకు ఇవ్వాలని ఆకాంక్షించారు.