వైద్యులపై దాడులు హేయం: ఐఎంఏ

నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే 24గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని, అలాంటి తమపైన దాడులు చేయడం హేయనీయమని, జిల్లాకేంద్రంలో పిల్లల వైద్యుడు సంతోష్ రాజ్ పైన దాడి చేయడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఐఎంఏ నిర్మల్ జిల్లా బాధ్యులు, పలువురు వైద్యులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ సంతోష్ రాజ్ పైన జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండిస్తోందన్నారు.
ఈ దాడిపై రాష్ట్ర, జాతీయ ఐఎంఏ శాఖలు స్పందించాయని చెప్పారు. గంటపాటు ఓపీ సేవలు నిలిపివేసి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారని చెప్పారు. ఆసుపత్రులలో వైద్యం పొందిన తర్వాత బిల్లులు, ఇన్సూరెన్స్ లు విషయంలో తమకు నిబంధనలు ఉంటాయన్నారు. కేవలం తాము అడిగిన రీయింబర్స్మెంట్ బిల్లులను ఇవ్వనందుకు ఇలా ఓ వైద్యుడిపై దాడి చేయడం అనేది శోచనీయమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను ఎవరు ప్రోత్సహించారని చెప్పారు. వైద్యులు, ఆసుపత్రులపై దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయని, పదేళ్లపాటు జైలు శిక్షతో పాటు అలాగే ఆస్తుల జప్తు వంటి శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
పోలీసులు 24 గంటలలో నిందితులను అరెస్టు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తాము ఆందోళనను విరమించినట్లు వివరించారు. వైద్యుడిపై జరిగిన దాడికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు అన్నివర్గాల నుంచి మద్దతు లభించిందని, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహా, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు జిల్లా ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. వైద్యురాలు రంజిత సంతోష్ రాజ్ మాట్లాడుతూ.. పది రోజుల కిందట ఆసుపత్రిలో నుంచి డిశ్చార్జ్ అయిన వారు రీయంబర్స్మెంట్ కోసం వచ్చారని చెప్పారు. తాము ఇచ్చిన బిల్లుల ప్రకారం కాకుండా రెట్టింపు ఇవ్వడం కుదరదని చెప్పడంతో వారు ముందుగా ఆసుపత్రి సిబ్బందిపై, ఆ తర్వాత వైద్యుడు సంతోష్ రాజు పైన దాడి చేశారని వివరించారు.
అత్యవసర వైద్య సేవలను సైతం అందిస్తున్న తమపై ఇలాంటి దాడులు చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎంఏ నిర్మల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, ప్రచార కార్యదర్శి డాక్టర్ కృష్ణంరాజు, బాధ్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పగలు రాత్రి అనే తేడా లేకుండా 24గంటల పాటు అందుబాటులో ఉంటూ, చిన్నారులకు వైద్యాన్ని అందించే డాక్టర్ సంతోష్ రాజ్ పైన దాడి చేయడమనేది అమానవీయమన్నారు. నిర్మల్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యావత్ వైద్యులందరూ ఈ ఘటనను ఖండించారని చెప్పారు. పోలీసులు ఇచ్చిన హామీ మేరకు తమ నిరసనను విరమించామని, త్వరలోనే నిందితులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇకముందు ఐఎంఏ తీసుకునే నిర్ణయాల ప్రకారం తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. వైద్యుల నిరసనలకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
