Collector | ఫ్యాక్టరీ ప్రారంభానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభం
పనులను పరిశీలించిన కలెక్టర్
Collector | నంగునూర్ : ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి (K.Haimavati) ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మెటలో రూ.300కోట్లతో నిర్మాణం చేస్తున్న ఆయిల్ పామ్ ప్యాక్టరీని గురువారం పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఫ్యాక్టరీ (factory) లోపల బీటీ రోడ్, డ్రైనేజీ నిర్మాణాల వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రహదారి వెంబడి చెట్ల పొదలు తొలగించాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వివిధ జిల్లాల నుండి తరలివచ్చే ప్రజల వాహనాలను నిలిపేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. వాహనాలను నిలిపేందుకు ఫ్యాక్టరీ పక్కన గల టీజీఐఐసీ స్థలన్ని చదును చెయ్యాలని తెలిపారు. వీఐపీ వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలని చెప్పారు.
ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ (factory) ప్రారంభం కోసం వచ్చే హెలికాప్టర్ దిగేందుకు అవసరమైన హెలిప్యాడ్ సిద్ధం చేయాలని రహదారులు భవనాల అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఫ్యాక్టరీ ప్రారంభానికి సంబంధించిన పనులను పక్కా ప్రణాళికలతో పగడ్బందిగా సిద్ధం చేయాలని ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రారంభానికి ఫ్యాక్టరీని సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి, ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఇంజనీర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

